
- ఉసిరికాయల్ని చూడగానే.. చూడ్డమేంటి దాని పేరు వింటేనే.. నోట్లో నీళ్లూరిపోతాయి. ఆ వెంటనే బాల్యంలోకి జారిపోయి.. పు..ల్ల..ని రుచి గుర్తుకు తెస్తుంది. చిన్నప్పుడు ఉసిరికాయని జామెంట్రీ బాక్సులో దాచుకుని.. క్లాసులో పాఠం మధ్యలో టీచర్ చూడకుండా ఉప్పూ, కారం అద్దుకుంటూ కొరుక్కుని తింటుంటే ఆ కిక్కే వేరు! ఇంకా బుగ్గన ఉసిరిని ఉంచి, కొంచెం కొంచెం కొరుకుతూ వచ్చిన రసాన్ని మింగుతూ మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే.. ఆ నీళ్లన్నీ తియ్యగా.. అలా గొంతులో జారిపోతూ ఉంటాయి. ఆహా! ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. అది అనుభవించి తీరాల్సిందే! భలే ఉంటుంది కదా ఆ అనుభూతి! ప్రస్తుతం ఇవి ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంతలా ఊరించే ఈ ఉసిరి ఎన్నెన్ని రకాల్లో.. ఎన్నెన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉందీ..
- దాని కథాకమామీషు ఈ కథనం..
ఉసిరికాయలను రోట్లో దంచుకోవాలి. వాటిలోని విత్తనాలను తొలగించి నీడపట్టున రెండు రోజులు పెట్టాలి. మూడోరోజు ఎండలో పెట్టి బాగా ఎండనివ్వాలి. తర్వాత ఆ పొడిని డబ్బాలో నిల్వ ఉంచుకుని ఎప్పుడైనా ఉసిరిక పచ్చడి చేసుకుని తినొచ్చు.
పచ్చడి: ఈ పచ్చడి తయారీకి ముందుగా ఉసిరి ఒరుగును తీసుకోవాలి. దానిని నీటిలో అరగంట నాననివ్వాలి. తర్వాత కొంచెం చింతపండు, ఉప్పూ, మిరపకాయలు, మెంతులు (వేయించినవి), ఆవాలు (వేయించినవి) వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు.
వడలు: ఉసిరికాయలను దంచి విత్తనం తీసేసి, ఒక డబ్బాలో రెండు రోజులు మగ్గనివ్వాలి. తర్వాత మూడోరోజు వడలలాగా చేసి ఎండలో ఎండపెట్టాలి. వాటిని పచ్చడి చేయాలంటే ఎండిన వడలను రోటిలో వేసి దంచుకోవాలి. ఆ పొడిని నీళ్లల్లో నానబెట్టి ఎండు ఉసిరి పచ్చడి చేసినట్లే చేస్తే సరిపోతుంది. దీన్ని సంవత్సరమంతా వాడుకోవచ్చు.
దేశవాళీ ఉసిరి..
చెట్టు కాండానికి, కొమ్మల కాండానికి అంటిపెట్టుకుని కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. దీన్నే 'చిన్న ఉసిరి' అని పిలుస్తారు. దీని కాయలు లేత ఆకుపచ్చని, పండాక లేతగోధుమ రంగులో ఉంటాయి. ఫలాలు ఉబ్బెత్తుగా, చారలు కలిగి ఉంటాయి. కాయలు కాస్త చిన్న పరిమాణంలో, చాలా పుల్లగా ఉంటాయి. రోటి పచ్చళ్లకు ఈ ఉసిరికాయలు వాడతారు. కూరల్లో పులుపు కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు..
- డ్వార్ఫ్ ఉసిరి..
చిన్ని చిన్ని జాగాల్లోనూ, కుండీల్లోనూ దేశవాళీ ఫలాలు కాసే ఉసిరి మొక్క డ్వార్ఫ్ ఉసిరి. ఇది రెండు నుంచి మూడడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. పెద్దగా నీరు అవసరం లేదు. ఇది హైబ్రీడ్ రకం. కాయలు తక్కువ కాసినా, సంవత్సరంలో ఎక్కువకాలం ఫలసాయం ఉంటుంది. ప్రస్తుతం ఇవి కాపు కాస్తూ ఉన్నాయి.
- వగరు దాని ఇంటిపేరు
ఏదో ఆపిల్ మాదిరిగానో, అరటి పండులాగానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే వగరు దాని ఇంటిపేరు. కానీ ఆ వగరే ఈ పండుకున్న బలం. కమలా రసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. అలాగని ప్రొటీన్లు లేవనుకునేరు.. ఆపిల్‌లో కన్నా మూడురెట్లు ఎక్కువే ప్రోటీన్లు ఉన్నాయి. ఇతర పండ్లలో కన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. వంద గ్రాముల రాతి ఉసిరిలో 80 శాతం నీరు, కొద్దిపాళ్లలో ప్రొటీన్లు, పిండిపదార్థాలు, పీచూ లభిస్తాయి. 470- 680 మి.గ్రా. సి-విటమిన్ లభ్యమవుతుంది. ఎంబ్లికానిన్-ఎ, ఎంబ్లికానిన్-బి, ప్యునిగ్లుకానన్ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్, గాలిక్ ఆమ్లం వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరుకుతాయి.
- ఉసిరి సాగు..
ఉసిరిని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేయవచ్చు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల నుంచి ఏప్రిల్ వరకు ఇవి కాపు కాస్తాయి. ఈ మొక్కలు దాదాపు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. అంటుకట్టడం, కొత్తగా అభివృద్ధి చేసిన రకాలతో తక్కువ ఎత్తు పెరిగి, అధిక దిగుబడిని ఇచ్చే మొక్కల రకాలు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీన్ని సాగు చేయడానికి ఎర్ర నేలలు, లోమ్, దుబ్బ, ఇసుక నేలలు సైతం అనుకూలంగా ఉంటాయి. భూమిలో పీహెచ్ విలువ 7 నుంచి 9.5 శాతం వరకూ ఉండే అన్ని నేలలల్లోనూ ఉసిరిని సాగు చేయవచ్చు.
ఉసిరి సాగుకోసం నేలలో 60* 60*60 సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలు (గొయ్యి) తీసుకోవాలి. ఇందులో 200 గ్రాముల నత్రజని ఎరువులు కలిపి గుంతల్లో వేసుకోవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న నర్సరీలను నుంచి అధిక దిగుబడిని ఇచ్చే ఉసిరి మొక్కలను తీసుకుని నాటుకోవాలి. అనంతరం మొక్కలకు నీరు పెట్టాలి. ఒక ఎకరం పొలంలో 160కి పైగా మొక్కలు నాటుకోవచ్చు. జూన్, జులై కాలంలో నాటుకుంటే మొక్కల పెరుగుదల మంచిగా ఉంటుంది. ఈ పంటకు సేంద్రీయ ఎరువులతోపాటు, కృత్రిమ ఎరువులను అందించాలి. మొక్కలు నాటిన మూడేళ్లకు కాపును అందిస్తాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఇవి కోతకు వస్తాయి. ఈ సమయంలో కాయలకు తెగులు సోకకుండా మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.
- రాతి ఉసిరి
రాతి ఉసిరినే 'పెద్ద ఉసిరి' అంటారు. వీటి ఫలాలు పెద్ద పరిమాణంలో ఉంటాయి. తొక్క దళసరిగా ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్నప్పటికీ కాయ తింటే నేరుగా పులుపు కనిపించదు. కాస్త వగరుగా ఉంటుంది. పచ్చళ్లల్లో, ఔషధాల్లో ఈ రకం కాయలనే ఎక్కువగా వాడతారు. మొక్క నాటిన మూడు నాలుగేళ్లకు కాపు కాస్తుంది. వీటిలో చాలా కొత్తరకాల మొక్కలు వస్తూ వున్నాయి. వాటిలో బిఎస్‌ఆర్-1, ఎన్.ఏ-7 లు ఉన్నాయి.
శ్రీలంక ఉసిరి: కాయలు కాస్త చిన్నగా, చాలా గుండ్రంగా ఉంటాయి. మెత్తగా లేత పసుపు రంగులో మగ్గినట్లుండే వీటి కాయలను రాలిపోయిన తర్వాత తింటే కాస్త తీపి ధార తగులుతుంది. కాపు కాస్త తక్కువగానే ఉంటుంది.
ప్రకృతి ప్రసాదించిన కాయల్లో ఉసిరికాయలు ఒకటి. వీటిలో పోషకాలు బోలెడు. ఔషధ గుణాలు మెండుగా ఉండే ఉసిరిని ఆరోగ్య సిరిగా చెప్పుకోవచ్చు. ఉసిరి ఐరోపా, పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాలకు చెందింది. దీనిని 'విలియం టర్నర్' 16వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. తర్వాత కొన్నేళ్లకు ఇది సాధారణ వస్తువుగా మారింది. 18వ శతాబ్దం చివరి నాటికి ఉసిరిని పంటగానూ వేయడం మొదలెట్టారు. రోజుకు ఒక్క ఉసిరికాయ తినేవారికి ఆరోగ్యరీత్యా ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయనే 'ఆమ'్ల, 'ఆమలక', 'ఇండియన్ గూస్‌బెర్రీ' అనీ అంటారు. పేరులోలాగానే ఇవి చాలా పుల్లగా, వగరుగా ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉండే ఉసిరి అనేక సుగుణాలు కలిగి ఉంటుంది. దీనిలో అధిక శాతం ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీని శాస్త్రీయ నామం 'ఫిలాంథస్ ఎంబ్లికా'. ఇది ఫిలాంథిసియా కుటుంబానికి చెందినది.
- ఎన్నో రకాలు
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉసిరి పెరుగుతుంది. దీనిని ఎక్కువగా పండించే దేశాల్లో ఇండోనేషియా మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. ఉసిరి చెట్లలో చాలా రకాలున్నాయి. ఎక్కువగా బలవంత్, నీలమ్, అమ్రిత్, కాంచన్ కృష్ణ, చక్కియా, బనారసి ఉసిరి జాతుల్ని పెంచుతుంటారు. వీటిలో అనేక రకాల విటమిన్లు, ఇతర పోషకాలు, గాలిక్ ఆమ్లం, టానిక్ ఆమ్లం, ఫిల్లెంబ్లిన్, టానిన్లు, ఫాస్ఫరస్, కాల్షియం వంటివి అధికంగా ఉంటాయి.
- మధ్యస్థంగా ఎదిగే చెట్టు
ఉసిరి మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మధ్యస్థంగా ఎదిగే చెట్టు. ఇంచుమించు 26 అడుగుల నుంచి 60 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఆకులేమో చిన్నగా చింతచెట్టు ఆకుల్లానే ఉంటాయి. పూలేమో ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటాయి. వీటి కాయలు ఆరు నిలువుచారలతో గుండ్రంగా ఉంటాయి. లోపలంతా పీచు ఉంటుంది. ఒకే కొమ్మకి బోలెడన్ని కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తుంటాయి. ఈ చెట్లకు సూర్యరశ్మి కావాలి. అన్ని నేలల్లోనూ ఇవి బాగా పెరుగుతాయి. నాటిన ఐదు సంవత్సరాలకు కాయలు కాస్తుంటాయి. మన దేశంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉసిరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు.
- చివికిపోదు
ఉసిరి చెక్క ఎన్ని సంవత్సరాలు నీళ్ళలో నానినా చివికిపోదు. ఉసిరితో చేసిన కొయ్య ఒరను బావి అడుగున ఉంచడం కేరళలో ఆనవాయితీ. దీనివల్ల నీటికి చల్లదనం, పరిశుభ్రత సమకూరతాయని నమ్మకం. ఎంబ్లికా అఫిసినాలిస్ (శాస్త్రీయ నామం) అనే ఈ మొక్క భారతీయ వైద్యంలో ప్రాచీన కాలం నుంచీ వాడుకలో ఉంది. దీనిలో విటమిన్ సి (అస్కార్చిక్ యాసిడ్) అత్యధిక పరిమాణంలో ఉంటుంది. దీనిని నిల్వ ఉంచినా, వండినా వైద్య గుణాలను కోల్పోదు. స్కర్వీవ్యాధి చికిత్సలో ఆమ్ల అత్యుత్తమ ఫలితాలు ఇస్తుంది.
ఉసిరి త్రిదోషహారిణి అంటోంది ఆయుర్వేదం. ఇది అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. అద్భుత ఔషధంగా చెప్పే చ్యవన్‌ప్రాశ తయారీలో ఇదే కీలకం.
- ఉసిరి వల్ల లాభాలు అన్నీ ఇన్నీ కావు.
ొ ఉసిరికాయలు, పువ్వులు, బెరడు, వేరు ఇలా అన్నీ ఔషధగుణాలున్నవే.
ొ దీనిలో విటమిన్ - సి చాలా ఎక్కువ. రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇంకా దీనిలో కెరోటినాయిడ్స్, గ్లూకోజ్, క్యాల్షియం, ప్రోటీన్లూ ఉంటాయి.
ొ అజీర్ణం, కిడ్నీ సమస్యల్లాంటివి ఉసిరితో తగ్గుతాయి. మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఎర్ర రక్తకణాలు పెరిగేందుకు ఉసిరి తోడ్పడుతుంది. ఆకలి మందగించడం, నోరు సహించకపోవడం వంటివి తగ్గుతాయి.
ొ ఉసిరితో కంటి చూపు మెరుగవుతుంది.
ొ కేశ సంబంధిత సమస్యలకు ఉసిరి బాగా పనిచేస్తుంది.
ొ ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. శరీర బరువు కూడా తగ్గొచ్చు.
ొ ఇందులో ఉండే లాక్సటివ్ ప్రాపర్టీస్ వలన మలబద్ధకం సమస్య దూరమౌతుంది.
ొ బాడీలో ఐరన్‌ను పెంచుతుంది. తద్వారా ఎనీమీయా రాకుండా ఉంటుంది.
ొ రకరకాల క్యాన్సర్లకీ, సెల్ డీజెనరేషన్‌కీ కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ని దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అడ్డుకుంటాయి.
ొ లైంగిక సామర్థ్యాన్ని, వీర్య సమృద్ధికి ఉసిరి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలగిస్తుంది.
ొ మెదడు పనితీరును మెరుగు పరిచి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
ొ మహిళల్లో నెలసరి సమస్యల్ని తొలిగించి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
ొ ఉసిరిక రసం - టీ స్పూన్, కొబ్బరి పాలు- కప్పు కలిపి రోజుకు రెండు, మూడుసార్లు తీసుకుంటే జీర్ణకోశంలోని నులి పురుగులు, బద్దె పురుగులు, కొంకి పాములు, ఏలిక పాములు వంటివి నశిస్తాయి.
ొ ఉసిరికాయలు, పెద్ద ఉల్లిగడ్డలను సమానంగా తీసుకుని, రసం తీసి ఆ రసాన్ని ప్రతిరోజూ తాగుతూ ఉంటే రక్తం అభివృద్ధి చెంది, శుద్ధి చేయబడుతుంది.
ొ కేశసంరక్షణకు ఉసిరి ఎంతో మేలు. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతో పాటు నల్లగా ఉంటాయి.
ొ దీంతో చేసే షాంపూలు, నూనెలు జుట్టుకి మంచివే. ఇవి బాల నెరుపును, చుండ్రును తగ్గిస్తాయి. ఆ కారణంతోనే ఈ మధ్య హెయిర్ ఆయిల్స్‌లో ఉసిరిని విరివిగా వాడుతున్నారు.
ొ ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని శరీరం నుండి బయటకు పంపి, వృద్ధాప్య ఛాయలు రాకుండా అరికడుతుంది.
ఉసిరిలో ఎన్నో రకాలున్నాయి... వాటిలో కొన్ని...
- కేశ ఉసిరి:
కాయలు నవనవలాడుతూ ఉంటాయి. లోపల గింజలు ద్రాక్ష గింజల్లా ఉంటాయి. వీటి ఆకులు ఉసిరి చెట్టు ఆకుల్లా కాకుండా పుచ్చపాదు ఆకుల్లా ఉంటాయి.
- అమెరికన్ రెడ్ గూస్‌బెర్రీ:
ఈ ఉసిరికాయలు ఎర్రగా తళ తళలాడుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పుడిప్పుడే మన దేశంలో అందుబాటులోకి వస్తున్నాయి.
నల్ల ఉసిరి: చూడ్డానికి నల్ల ద్రాక్షలాగా, నల్ల నెరేడుల్లా ఉంటాయి. దీని కాపు కాస్త మందమే. ఇదీ కూడా అమెరికా రకమే. కాయలు చాలా పుల్లగా ఉంటాయి. వీటికి చాలా గిరాకీ.
బిలింబి: అంగుళం లావు, రెండూ, రెండున్నర అంగుళాల పొడవు ఉండే సరికొత్త ఉసిరికాయ బిలింబి. చెట్టు కాండానికి, కొమ్మలకు అంటిపెట్టుకుని గుత్తులు గుత్తులుగా కాస్తాయి. చాలా పుల్లగా ఉంటాయి. ఇవి తింటే నోటిపూత త్వరగా తగ్గుతుంది. వీటిని పక్వానికొచ్చిన తరువాత వెంటనే కోయకపోతే కాయలు రాలిపోయి నీరుగారిపోతాయి. మొక్క నాటిన మూడేళ్ళకి బిలింబిలు కాపునిస్తాయి.ఉసిరి బిలింబిని దోస బిలింబి, దోసచెట్టు, సోరెల్ వృక్షం అనీ పిలుస్తారు.
- కేప్ గూస్‌బెర్రీ:
దీనిని గోల్డెన్‌బెర్రీ, పెరువియన్ గ్రౌండ్ చెర్రీ అని కూడా పిలుస్తారు. తేలికపాటి ఇసుక నేలల్లో, బంకమట్టి నేలల్లో బాగా పెరుగుతుంది. నేల పోషకాహారం తక్కువగా ఉన్నప్పటికీ ఇది బాగా పెరుగుతుంది. ఇది ఎంత ఎండలోనైనా, నీడలోనైనా పెరుగుతుంది.
- చైనీస్ గూస్‌బెర్రీ:
దీనిని చైనాలో 'చైనా గూస్‌బెర్రీ' అంటారు. ఇది ఉసిరిలో ఒకరకం. ఇదే 'కివి పండు. ఇందులో ఉసిరిలో ఉన్న పోషకాలన్నీ ఉంటాయి. ఇది 12వ శతాబ్దానికి చెందినది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ పండ్ల సాగు చైనా నుంచి న్యూజిలాండ్ వరకూ వ్యాపించి ఉంది. తర్వాత 1960లో కాలిఫోర్నియాకు ఎగుమతి చేశారు. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ అందుబాటులో ఉంది.
- మురబ్బా:
తగినంత నీటిలో ఉసిరికాయలు ఉడికించి గింజలు తీసేయాలి. పాన్‌లో ఉసిరి గుజ్జుకు రెట్టింపు బెల్లంతో పాటుగా లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసి చిన్నమంటపై 30 నిమిషాలు ఉడికించాలి. తర్వాత దించేసి, రెండు రోజుల పాటు పక్కనుంచి మరోసారి వేడి చేయాలి. అప్పుడు అది చిక్కబడ్డాక ఉప్పు, కుంకుమపువ్వు కలిపి మరో పది నిమిషాలు ఉడికించి మంటను ఆపెయ్యాలి. చల్లారిన తర్వాత సీసాలో వేసి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే కనీసం ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది.
- స్వర్ణలత నూకరాజు