సముద్రం
మంచి నీటి బొట్టు ముందు
చేతులు కట్టుకుంది
దాహం తీర్చలేనన్న తన దౌర్భాగానికి తిట్టుకుంటూ..
నాలుగు అంతస్థుల భవంతి
రెండు పచ్చని ఆకుల కోసం
పూలకుండి కాళ్ళ వద్ద
రోజు దాస్యం చేస్తుంది.
ప్రకృతితో కలసి జీవించడం
నామోషీగా భావించే మనిషి
షోకేసులో
దాని అందాల్ని బంధించి ఆరాధిస్తాడు.
పిల్లలతో కళకళలాడిన ఇల్లు
వాళ్ళ పెళ్లితో
వృద్ధులతో కలసి
ఒంటరిగా మిగిలింది
చిన్నప్పటి పల్లమైన ఈ చోటు పెద్దదై, మెరకై హద్దులు చెరుపుకుంటూ
ఎత్తుకు చేరినా
పాతబంధం చెమ్మ తగులుతోంది.
ఆ వీధికి నేనంటే ఎంతో ప్రేమ.
లోపలి ప్రేమని
బయట పంచేది
తానొక్కడినేనని తెలిసి.
పిల్ల కాలువలా
ఆ పుస్తకంలో పేజీలు
నన్ను ముంచెత్తి ఎక్కడికో కోసుకుపోతున్నాయి.
కుంపటిపై ఉడికే పప్పు వాసనలా
ఊరి బొడ్డురాయి వద్ద జరిగే ''చర్చ''
మనసు ఆకలి తీర్చే
గొప్ప రుచి గల ఊరి వంటకం.
- చందలూరి నారాయణరావు
97044 37247