
రాష్ట్రమంతటా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు అమర్చడానికి వైసిపి ప్రభుత్వం ఆత్రంగా ఉంది. రాష్ట్రంలోనే వెనకబడ్డ శ్రీకాకుళం జిల్లాను మీటర్ల ప్రయోగానికి ఎంపిక చేసుకోగా, రైతుల నుండి నిరసనలు, ప్రతిఘటనలు ఎదురయ్యాయి. అయినా సరే, శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయిందని ప్రకటించేసుకొని త్వరలో రాష్ట్రంలోని వ్యవసాయ బోర్లన్నింటికీ మీటర్లు బిగిస్తోంది. కాగా కేంద్ర బిజెపి సర్కారు ఒత్తిడి మూలంగానే రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు పెడుతోంది. అదనపు అప్పులు చేయాలంటే తాము నిర్దేశించిన షరతులు తూచ తప్పక అమలు చేయాల్సిందేనని మోడీ సర్కారు రాష్ట్రాలపై కొరడా ఝళిపిస్తోంది. ఆర్‌డిఎస్‌ఎస్‌ను అమలు చేసి స్మార్ట్ మీటర్లు బిగించాలని మోడీ ప్రభుత్వం ఏ విధంగా బలవంతం చేస్తోందో చూశాం. కేంద్రం ఆదేశాల ఫలితమే చెత్త పన్ను, వ్యవసాయ బోర్లకు మీటర్లు, ఆస్తి పన్ను పెంపు, రవాణా ఛార్జీల పెంపు వగైరా వగైరా. నయా-ఉదారవాద, కార్పొరేట్ అనుకూల విధానాల అమలుకు కరోనా వేళ బిజెపి రుద్దిన 'ఆత్మనిర్భర్' ప్రోగ్రాంలో ఇలాంటివి పుష్కలంగా ఉన్నాయి. రుణ మాఫీలు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను వదిలించుకోవాలని మోడీ ప్రభుత్వ మానస పుత్రిక నీతి ఆయోగ్ ఎప్పుడో చెప్పింది. ఉచిత విద్యుత్ అమలవుతున్న బోర్లకు మీటర్ల అంతిమ లక్ష్యం ఉచిత విద్యుత్‌కు మంగళం పాడించేందుకే.
కేంద్రం పదును పెట్టిన విద్యుత్ 'సంస్కరణల' కత్తిని అప్పుల కోసం రైతులపై దూయడం వైసిపి సర్కారుకు తగనిపని. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించినప్పుడే వైసిపి నిత్యం వల్లించే రైతు పక్షపాతానికి నిజమైన అర్థం. కాగా ప్రభుత్వం మీటర్ల బిగింపు చర్యను సమర్ధించుకోడానికే సిద్ధపడింది. విద్యుత్ ఆదా, నాణ్యమైన విద్యుత్, తొమ్మిది గంటల నిరంతర కరెంట్, పారదర్శకత, జవాబుదారీతనం అని మభ్యపెట్టచూస్తోంది. పద్దెనిమిదేళ్లుగా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇన్నేళ్లలో లేని సమస్యలు ఇప్పుడే ఎందుకొచ్చాయి? ఫ్రీ కరెంట్ అన్నప్పుడు మీటర్ల కొలతలెందుకు? మీటర్‌లో రీడింగ్ తీయడం, నిర్ణయించిన టారిఫ్ ప్రకారం బిల్లు లెక్కించడం, రైతుల బ్యాంక్ అకౌంట్‌కు బిల్లు అమౌంట్ జమ చేయడం, ఆటోమేటిక్‌గా ఆ అమౌంట్ డిస్కంలకు బదలాయించడం, ఈ తంతు దేనికి? నిస్సందేహంగా నగదు బదిలీ కోసమే. ప్రస్తుతానికి రైతులకు ఇబ్బందేమీ లేకపోవచ్చు. భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వాలు మారితే, డిస్కంల ప్రైవేటీకరణ జరిగితే డబ్బు చెల్లించలేదని విద్యుత్ సరఫరా నిలిపేస్తారు. తుదకు రైతులే బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. నగదు బదిలీ మర్మం ఇదే. ఇప్పటికే వంట గ్యాస్ విషయంలో ప్రజలకు అనుభవమైంది. రేషన్ అయినా, ఉచిత విద్యుత్ అయినా నగదు బదిలీ అంటే పథకాల లబ్ధిదారులను క్రమంగా కుదించేందుకు చేపట్టిన కుట్ర.
ఉచిత విద్యుత్ అనేది రైతుల ఆందోళనల నుండి పుట్టిన డిమాండ్. ఉమ్మడి రాష్ట్రంలో వరుస కరువులతో రైతులు అల్లాడుతున్న తరుణంలో ముందుకొచ్చిన కోర్కె. కాల్వల కింద సాగుకు రైతుకు తక్కువ ఖర్చవుతుండగా, భూగర్భజలాలను పైకి తోడిపొయ్యడానికి కరెంట్ బిల్లులు తడిసి మోపెడయ్యాయి. 'సంస్కరణల'ను భుజానికెత్తుకున్న టిడిపి సర్కారు ఫ్రీ కరెంట్‌ను తిరస్కరించగా, 2004లో సి.ఎం గా వై.ఎస్ తొలి సంతకంతో ఉచిత విద్యుత్ మొదలైంది. ప్రపంచబ్యాంక్ వంటివి ఫ్రీ కరెంట్ వద్దన్నా రైతుల ఆగ్రహాన్ని ఎక్కడ చవి చూడాల్సి వస్తుందోనన్న భయంతో ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. చారిత్రక అవసరంగా ముందుకొచ్చిన ఉచిత విద్యుత్‌కు, కేంద్రం ఒత్తిడికి తలొగ్గి మీటర్ల రూపంలో ఉరితాడు పేనుతోంది వైసిపి సర్కారు. ఇప్పటికే వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పులు, ఆత్మహత్యలతో అన్నదాత సతమతవుతున్నాడు. ఉచిత విద్యుత్‌కూ ఎసరు పెడితే రైతు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. తెలంగాణలో కెసిఆర్ సర్కారు మీటర్లు బిగించేది లేదని కేంద్ర ఆదేశాలను తిరస్కరించింది. వైసిపి ప్రభుత్వం సైతం కేంద్ర షరతులను తిరస్కరించి రైతుల, ప్రజల విశాల ప్రయోజనార్ధం మీటర్ల అమరికను ఉపసంహరించుకోవాలి.