Jul 24,2023 20:59

ఆత్మహత్య చేసుకున్న రైతు బాలు(46)

ఉరేసుకుని రైతు ఆత్మహత్య
ప్రజాశక్తి - బేతంచెర్ల

     బేతంచెర్ల మండలం గూటిపల్లి గ్రామానికి చెందిన రైతు బాలు (46) అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రైతు బాలు గూటిపల్లి గ్రామంలో తనకున్న రెండున్నర ఎకరాలతో పాటు మరో 3 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, కంది, పొద్దు తిరుగుడు తదితర పంటలు సాగు చేశాడు. గత మూడు సంవత్సరాలుగా పంటల దిగుబడి అంతంత మాత్రంగా రావడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాలు మిగిలాయి. పంటల సాగు కోసం చేసిన అప్పులు రూ.8 లక్షలకు చేరుకున్నాయి. అప్పులు ఇచ్చిన వారు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అప్పులు ఎలా తీర్చాలోనని మదన పడుతూ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుకు భార్య రాములమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. సమాచారం అందుకున్న బేతంచర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హెడ్‌ కానిస్టేబుల్‌ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.