Aug 02,2023 00:03

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : నిండు గర్భిణి ఉరివేసుకున్న ఘటన సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన ప్రియ (23) ఇంటి పై కప్పునకు ఉరివేసుకుంది. రెంటచింతల మండలం దైదకు చెందిన ప్రియకు సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన కొరబండి నాగేశ్వరరావుతో సుమారు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 18 నెలల పాప కాగా ప్రియ ప్రస్తుతం 8 నెలల గర్భిణి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రేకుల ఇంటి పైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మతదేహాన్ని కిందకు దించి మార్చురీ బాక్స్‌లో ఉంచారు. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. భర్త, అత్తమామమే తమ కుమార్తెను హత్య చేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు గాలి స్వాతి, శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.