Sep 02,2023 21:01

మాట్లాడుతున్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ అబ్దుల్‌ కలీమ్‌

 రాయచోటి టౌన్‌ : ఉర్దూ భాషాభివద్ధి అందరి ధ్యేయం కావాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ అబ్దుల్‌ కలీమ్‌ అన్నారు. శనివారం స్థానిక ఉర్దూ అకాడమీ కంప్యూటర్‌ శిక్షణ కేంద్రంలో రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఉర్దూ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో కంప్యూటర్‌ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ భాష ఎంతో మధురమైందని, భారతదేశంలో పుట్టి విశ్వవ్యాప్తంగా విస్తరించిన ఈ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉర్దూ భాషలో అభ్యసించిన వారు కూడా అత్యున్నత స్థాయి హోదాలలో ఉన్నారని, ఇతర భాషల కంటే ఉర్దూ భాషలో చదివిన వారికే ఎక్కువగా ఉపాధి అవకాశాలు వరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో 30 కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాల్లో యువతకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు, మిగిలిన ఆరు కేంద్రాల్లోనూ పది రోజుల్లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో ఎంఒయూ చేసుకున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ కంప్యూటర్‌ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారని, వీరికి విడతలవారీగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి ఇమ్రాన్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను యువత సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలన్నారు. కంప్యూటర్‌ కోర్సుల శిక్షణ ప్రస్తుత సమాజంలో చాలా అవసరమని, కంప్యూటర్‌ కోర్సులలో శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా పట్టుదలతో సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ ఇర్ఫాన్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డిఎస్‌డిఒ హరికష్ణ, నాయకులు రియాజుద్దీన్‌, గ్రంథాలయ అధికారి కరీం బాషా, సిటిసి ఇన్‌ఛార్జి దర్బార్‌ బేగం, రూటా రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ ఖాన్‌, ఉర్దూ ఉపాధ్యాయులు హాషీమ్‌, షరాఫత్‌ అలీ ఖాన్‌, మౌలానా ఇందాదుల్లా ఖాన్‌, ఇమ్రాన్‌ పాల్గొన్నారు.