Jun 27,2021 06:50

'ఊపర్‌ షేర్వాణీ ... అందర్‌ పరేషాని' అని ఒక ఉర్దూ సామెత వుంది. మన దేశం పరిస్థితి కూడా ఇలాగే వుంది. 'అభివృద్ధిలో దూసుకుపోతున్నాము... అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నాము' అంటూ చెప్పే పాలకుల వాగాడంబరం కూడా 'ఊపర్‌ షేర్వాణీ' లాంటిదే. ప్రపంచ ఆకలి ఇండెక్స్‌లో 'ఆకలి సమస్య తీవ్రంగా' వున్న దేశాలలో మన దేశం వుంది. ఇది దేశంలో తాండవిస్తోన్న పేదరికానికి నిదర్శనం. బలహీనమైన ఆర్థికవ్యవస్థ గల దేశాలలోనే పేదరికం ఎక్కువగా కనిపిస్తుంది. ''ప్రజల ప్రాణముల్దీయుచుండె పాపిష్టి వ్యాధి/ కనివినియెరుగని కాలనాగులవలె/ విలయతాండవము జేయుచుండె విస్తతముగ''... అంటూ కరోనా మహమ్మారి గురించి రాస్తాడో కవి. ప్రపంచవ్యాప్తంగా... ఇంతకంటే భయంకరంగా విలయతాండవం చేస్తూ, ప్రజల ప్రాణాలను తీసే మరో వ్యాధి కూడా వుంది. అదే.. పేదరికం. ఇది ప్రకతి విపత్తు కాదు... దేవుడు రాసిన తలరాత అంతకంటే కాదు. సామాజిక దుర్నీతి తెచ్చిన విపత్తు ఇది. 'ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనింపగలదు? / ఏ రాజకీయవేత్త గుండెలను/ స్పృశించగలదు? ఏ భోగవంతుని/ విచలింప చేయగలదు? ఏ భగవంతునికి/ నివేదించు కొనగలదు...?'
వాస్తవానికి 1974 నుంచి వరుసగా ప్రతి ఏడాది పేదరికం కొంతమేరకు తగ్గుతూ వచ్చింది. అయితే గడిచిన ఏడాదికాలంలో గర్భదరిద్రుల సంఖ్య 5 కోట్ల 90 లక్షల నుండి అమాంతం 13కోట్ల 40లక్షలకు పెరిగిపోయింది. అయితే, పేదరికాన్ని తగ్గించే బదులు తప్పుడు నివేదికలతో పేదరికం కొలబద్దను తగ్గించారు. అంటే... దేశంలోని పేదరికాన్ని తగ్గించి చూపడం ద్వారా దేశంలో పేదలు తగ్గారని, పేదరికం రేటు తగ్గిందని పాలకులు చెప్పదల్చుకున్నారు. పేదరికంపై ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కో లెక్కలు చూపుతోంది. దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని, పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం శరవేగంగా కనుమరుగవుతోందని ప్రణాళికా సంఘం ప్రకటించింది. ఎప్పటికప్పుడు ప్రాతిపదికలు మార్చుతూ, ఆ సంఖ్యను సవరిస్తోంది. ఒక క్లాసు టీచర్‌... తన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని బట్టి గ్రేస్‌ మార్కులు పెంచుకుంటూ పోయినట్లు... ప్రభుత్వం కూడా పేదరికం రేటును తగ్గించుకుంటూ పోతోంది. ఇటువంటి గిమ్మిక్కులతో పేదరికం పోదు సరికదా దేశం పరువే పోతుంది. మన పక్కనే వున్న చైనా కచ్చితమైన ప్రణాళికలు వేసుకొని 20ఏళ్లలో పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి ఆచరణలో పెట్టింది. మన దేశం పేదరికాన్ని నిర్మూలిస్తున్నామని చెబుతూ...ఎన్ని ప్రణాళికలు వేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా మరింత దిగజారిపోయింది. దీనికి కారణం ఎవరు? ఇంతకుముందు పేదరికాన్ని నిర్మూలించడం ప్రభుత్వ బాధ్యతగా వుండేది. నయాఉదారవాదం వచ్చిన తర్వాత సమాజాభివృద్ధికి పెట్టుబడిదారులే చోదకశక్తిగా పనిచేస్తారని చెబుతోంది. కాని ఆ పెట్టుబడిదారుల ఆస్తులు రెట్టింపు కావడం, ఇటు పేదరికం రెట్టింపు కావడం ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి పెట్టుబడిదారులు దేశాన్ని ఉద్దరిస్తారన్న వాదన పచ్చి బూటకం.
భూమి, ప్రకృతి, వనరులు ఉమ్మడి సొత్తు అయినప్పుడు కొంతమంది పేదలెందుకయ్యారు? ఇంకొంతమంది ధనవంతులెట్లయ్యారు? కష్టపడకుండానే నిమిష నిమిషానికి వారి సంపద ఎలా పెరుగుతోంది. మరోపక్క పేదరికం ఎందుకు పెరుగుతోంది. అదాని ఆస్తి రెట్టింపు అవడంలో ఆయన కష్టం ఎంత? నిరుపేదల సంఖ్య రెట్టింపు అవడానికి ఆ పేదలే బాధ్యులా? దీనిలోని మర్మాలు చూడకుండా మనవంతుగా అడపాదడపా ఎవరికైనా కొంత సహాయం చేసి, మనం ఆత్మసంతృప్తి చెందితే సరిపోదు. పేదరికమూ పోదు. మౌలికంగా ఈ వ్యవస్థలోనే మార్పు రావాలి. ఇది వ్యవస్థల్లోని తేడా తప్ప మరొకటి కాదు. కాబట్టి... ఆ వ్యవస్థ మార్పుకోసం మనిషిగా మనవంతు బాధ్యతను నిర్వర్తించాలి. 'ఒక్క నిరుపేద ఉన్నంతవరకు, ఒక్క మలినాశ్రు/ బిందు వొరిగినంతవరకు,/ ఒక ప్రేగు ఆకలి కనలినంతవరకు,/ ఒక్క శుష్క స్తన్య సన్నిధిని క్షుధార్తి నేడ్చు పసిపాప/ ఉన్నంతవరకు,/ నాకు శాంతి కలగదింక నేస్తం...' అంటూ ఆకలితో అల్లాడిన ముసలివాడ్ని చూసి తిలక్‌ వాపోతాడు. సామాజిక బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తీ నేను సైతం అంటూ... ఈ వ్యవస్థ మార్పుకోసం నడుం కట్టాల్సిన అవసరం వుంది. ప్రపంచ పేదరిక దినోత్సవం ఒకరోజు పండుగ కారాదు. ఒక వ్యవస్థనే సమూలంగా మార్చే దిశగా మనం వేసే ఒక ముందడుగు కావాలి.