May 30,2023 00:19

వినతిపత్రం అందజేస్తున్న మత్స్యకారులు

ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని రాజయ్యపేట ఉప్పుటేరులో పూడికతీత తీయించి, నీరు నిల్వ ఉండేటట్లు చేసి, చేపలు పెంచి ఉపాధి కల్పించాలని మత్స్యకారులు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక తహసిల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఉప్పుటేరులో పూడికతీత తీయించి, ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం తహాశీల్ధార్‌ కార్యాలయం సిబ్బంది సుదర్శన్‌, కన్నబాబు లకు వినతిపత్రం అందజేశారు. రాజయ్యపేట గ్రామం సర్వే నెంబర్‌ 291లో 400 ఎకరాలు ఉప్పుటేరు ఉందన్నారు. వేట నిషేధ సమయంలో నీరు ఉన్న సమయంలో ఉప్పుటేరులో రాజయ్యపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు వేట చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందన్నారు. ఉప్పుటేరులో మట్టి పేరుకుపోవడంతో నీరు నిల్వ ఉండటం లేదని, దీంతో వేట చేసుకునేందుకు అవకాశం లేకుండా పోతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 15 నుండి జూన్‌ 15 వరకు వేట నిషేధ కాలంలో ఉప్పుటేరులో వేట చేసుకుని ఉపాధి పొందే విధంగా ఉప్పుటేరును అభివృద్ధి చేయాలని కోరారు. ఉప్పుటేరులో సుమారు పది అడుగుల లోతు పూడికతీత తీయించి నీరు నిల్వ ఉండే విధంగా పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు మామిడి నానాజీ, గోసల సోమేశ్వరరావు, చేపలు సోమేష్‌, బొంది నూకరాజు, వాసుపిల్లి నూకరాజు, పిక్కి కోటి, మైలపల్లి దార్రాజు, మైలపల్లి బాపూజీ పాల్గొన్నారు.