Sep 03,2021 06:02

ఈ ప్రాంతంలో ఖరీఫ్‌ పంట వేయడం, ఉప్పు నీరు వల్ల వ్యవసాయం ముంపుకు గురవుతుండడంతో పంట చేతికి రావడం లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టడం వల్ల రైతాంగం తీవ్రంగా అప్పులు పాలై గత కొద్ది సంవత్సరాలుగా మొదటి పంట (ఖరీఫ్‌) సాగు మానివేశారు. దీనివల్ల పేద రైతులు, వ్యవసాయ కార్మికులు పనులు లేక అనేక అవస్తలు పడుతున్నారు. అయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు లేదు.
     పచ్చని కోనసీమలో ఆహ్లాదకరమైన వాతావరణం కనువిందు చేస్తుంది. కోనసీమను రెండవ కేరళ అని పిలుస్తారు. ఉప్పలగుప్తం మండలం లోని రైతాంగం పరిస్థితి పేరు గొప్ప .. ఊరు దిబ్బ.. చందంగా వుంది. గోదావరి నీరు వల్ల పుష్కలంగా పంటలు పండే ప్రాంతంలో రొయ్యలు, చేపల చెరువుల వల్ల నీరు, గాలి...మొత్తం వాతావరణమే కలుషితంగా మారిపోతున్నది. అనుమతి లేకుండా తవ్విన రొయ్యల, చేపల చెరువులను పూడ్చి వేయాలని 2018లో హైకోర్టు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ సందర్భంగా కలెక్టర్‌ జోక్యం చేసుకుని అనుమతి లేకుండా తవ్విన చెరువులను పూడిపించారు. కానీ నేడు యథావిధిగా అనుమతి లేకుండా వందలాది ఎకరాలు చెరువులుగా మార్చేస్తుంటే అధికారులు కళ్ళప్పగించి చూస్తున్నారు. పంట పొలాలు చెరువులుగా మారిపోవడంతో వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.
     ఉప్పలగుప్తం మండల కేంద్రం లోని ఉప్పలగుప్తం పంచాయితీలో 1500 ఎకరాల ఆయుకట్ట, పొరుగున ఉన్న వానపల్లి పాలెం పంచాయితీలో 500 ఎకరాలు పైబడి వరి సాగవుతుంది. ఇక్కడి సింగాయి చెరువు కాలువ, పేరయ్య చెరువు కాలువలు రెండూ పంట కాలువలే. కూనవరం మేజర్‌ డ్రైన్‌ నుండి పావురాయికోడు ఎన్‌.కొత్తపల్లి కాలువ ద్వారా సముద్రపు ఉప్పు నీరు ఎగదన్నడంతో సింగాయి చెరువు, పేరయ్య చెరువు పంట కాలువ, బోదుల్లోకి ఉప్పునీరు ప్రవేశించి మొత్తం పంట ముంపుకు గురవుతున్నాయి. కూనవరం స్ట్రైయిట్‌ కట్‌ మొగ నుండి మురికి నీరు సముద్రంలోకి కలుస్తుంది. ఉప్పలగుప్తం మండలం పైనున్న ఐదు మండలాల నుండి మురుగు నీరు కూనవరం స్ట్రైయిట్‌ కట్‌లో కలుస్తుంది. దీనివల్ల సముద్రం పోటు వచ్చినప్పుడు ఉప్పునీరు ఎగదన్ని కూనవరం మేజర్‌డ్రైన్‌ ఎగదన్నినప్పుడు పావురాయి కాలువలో కలిసి కిందకు ప్రవహిస్తుంది. దీనివల్ల మొదటి పంట (ఖరీఫ్‌) 2000 ఎకరాల్లో పంట దెబ్బ తింటుంది. ఈ ఉప్పు నీరు కూనవరం డ్రైన్‌లో కలవకుండా వుండాలంటే మురికినీరు కలిసేచోట కాలువపై షట్టర్లు ఏర్పాటు చేస్తే మురుగునీరు రాదు. అప్పుడు ఖరీఫ్‌లో కూడా పంట వేయవచ్చు.
     జి.యం.సి.బాలయోగి పార్లమెంట్‌ స్పీకర్‌గా వున్నప్పుడు...రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూనవరం డ్రైన్‌పై షట్టర్‌ నిర్మాణ ప్రతిపాదన వచ్చింది. బాలయోగి మరణంతో షట్టర్‌ నిర్మాణ ప్రతిపాదన అటకెక్కింది. టిడిపి ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు హోంమంత్రి రాజప్పతో కలిసి ఆ ప్రాంతం పర్యటించినప్పుడు... షట్టర్‌ నిర్మాణం చేసి పంట కాలువ లోకి మురుగునీరు రాకుండా చూస్తామని రైతాంగానికి హామీ ఇచ్చారు గాని షట్టర్‌ నిర్మాణం జరగనేలేదు.
      జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలు పైబడింది. ఈ మధ్యనే వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌గా నియమితులైన మోటూరి సాయి జిల్లా సమావేశంలో కలెక్టర్‌ సమక్షంలో షట్టర్‌ నిర్మాణ ఆవశ్యకత గూర్చి వివరించి పంటను ముంపు నుండి కాపాడి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జగన్‌ పాలనలో షట్టర్‌ నిర్మాణం పూర్తి అవుతుందనే భ్రమల్లో వుంది రైతాంగం. ఐదు సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఖరీఫ్‌ పంట వేయడం, ఉప్పు నీరు వల్ల వ్యవసాయం ముంపుకు గురవుతుండడంతో పంట చేతికి రావడం లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టడం వల్ల రైతాంగం తీవ్రంగా అప్పులు పాలై మొదటి పంటను (ఖరీఫ్‌) గత కొద్ది సంవత్సరాలుగా సాగు మానివేశారు. దీనివల్ల పేద రైతులు, వ్యవసాయ కార్మికులు పనులు లేక అనేక అవస్తలు పడుతున్నారు. అయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు లేదు.
       ఈ ప్రాంతంలో ఉన్న 2000 ఎకరాలలో 20 మంది భూస్వాముల చేతిలో 600 ఎకరాలకు పైగా ఉన్నాయి. ఈ భూస్వాములెవ్వరూ సొంత సాగు చేయడం లేదు. వీరి భూమి దళితులకు కౌలుకు ఇచ్చి ఇతర వ్యాపకాలు చూసుకుంటున్నారు. దళితుల చేతుల్లో 500 ఎకరాల సాగుభూమి వుంది. మిగిలిన సాగుభూమి పేద రైతులు సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా రెండే సామాజిక వర్గాలున్నాయి. ఒకటి కాపు, రెండు దళితులు. కాపు సామాజిక వర్గానికి చెందిన భూస్వాములు వారి భూమిని దళితులకు కౌలుకిచ్చేయడం వల్ల ముంపు గురించి గానీ, షట్టర్‌ నిర్మాణం గురించి గానీ భూస్వాములు పట్టించుకోవడం లేదని దళిత పేద రైతులు, దళిత కౌలురైతులు ఆవేదన చెందుతున్నారు. మొదటి పంట లేకపోయేసరికి పనులు లేక ఈ గ్రామాల నుంచి కృష్ణా జిల్లాకు వలస పోయి నాట్లు సీజన్‌ తర్వాత తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు.
      వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపియస్‌, సిఐటియు నాయకులు ముంపు ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పేద రైతులు తమ కష్టాలను వెల్లడించారు. ''మొదటి పంట లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండవ పంటను (రబీ) వేయడం వల్ల ఐదు, పది బస్తాలు అధనంగా దిగుబడి అవుతోంది. గతంలో పంటను నేరుగా వర్తకులకు అమ్ముకునే వారు. డబ్బులు కూడా వారం రోజుల్లో చేతికి వచ్చేవి. అప్పులు త్వరగా తీర్చేసేవారం. నేడు ఈ క్రాప్‌ బుకింగ్‌ రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకోవాలిజ కొనుగోలులో కూడా జాప్యం జరుగుతోంది. ధాన్యం అమ్మిన తరువాత పేమెంట్‌ ఇవ్వడం ఆలస్యమవుతోంది. పెట్టుబడికి చేసిన అప్పులకు అదనంగా వడ్డీ కట్టాల్సి వస్తుంది. వడ్డీ పీడ భరించలేక పోతున్నాం'' అని వారు చెప్పారు. పేమెంట్‌ త్వరగా ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని వారు వ్యవసాయ కార్మిక సంఘ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి మేట్ల నాయకుడు మాకే వెంకటేశ్వరావు మాట్లాడుతూ మొదటి పంట లేకపోవడం, ఉపాధి పనులు కూడా ఎక్కువ రోజులు లేకపోవడంతో అప్పులు చేసి బతకాల్సి వస్తుందని వాపోయాడు. అప్పులు చేసి బతుకుతున్నామని వడ్డీలు కట్టడం చాలా భారంగా ఉందని, ఉపాధి పనులు ఇప్పుడు చెప్తున్న దాని కన్నా అదనంగా 100 రోజులు పని కల్పించి, రూ.600 కూలీ ఇస్తే దళిత వ్యవసాయ కార్మికులు వలసలు పోయే పరిస్థితి నుండి విముక్తి అవుతారని చెప్పారు. కౌలు రైతులు మాట్లాడుతూ రైతు భరోసాకు కౌలు గుర్తింపు కార్డులతో నిమిత్తం లేకుండా గ్రామ సభలు ద్వారా కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా ఇవ్వాలని కోరారు. బ్యాంకులు కూడా కౌలు రైతులకు అప్పులు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారులపై ఆధార పడాల్సి వస్తుందన్నారు. పంటలు వేయని భూము లకు సంబంధించిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
 

/ వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర అధ్యక్షులు, సెల్‌ : 94900 98833 /
దడాల సుబ్బారావు

దడాల సుబ్బారావు