ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: మండలంలోని ఉప్పుగుండూరులో స్టార్ ఫౌండేషన్, హైదరాబాద్ వారి సౌజన్యంతో, రెండో విడత ఘగరు, బీపీ వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. పై వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్షలు నిర్వహించి, వైద్యులు సూచించిన ప్రకారం ఒక నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సానల ధీరజ్ బాబు ఎండి (జనరల్ మెడిసిన్), డాక్టర్ ఆర్ గౌతమిలు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ధీరజ్‌బాబు మాట్లాడుతూ, షుగరు, బీపీ వ్యాధులకు నివారణ లేదని, నియంత్రణ మాత్రమే సాధ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని, లేనియెడల అనేక వ్యాధులకు ఆస్కారం వుంటుందని అన్నారు. శారీరక శ్రమ, ఆహార నియమాలు, మందు బిళ్లలు, అప్రమత్తత అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్ ఫౌండేషన్ నిర్వహకులు శ్రీ సూరి కోటా రెడ్డి దంపతులు, తన్మయిరెడ్డి ఈ కార్యక్రమ కో-ఆర్డినేటర్ కెఎల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










