నిడమర్రు మండలంలో పరిస్థితి దారుణం
ఉప్పునీటి రొయ్యసాగుతో చౌడుబారిన వరి పొలాలు
పంట కాలువల్లోకి యథేచ్ఛగా ఉప్పునీరు విడుదల
కొల్లేరును ఆనుకుని ఉన్న వేలాది ఎకరాల వరిపొలాలు నాశనం
రబీ నాట్లు వేయకుండా బీడుగా భూములను వదిలేస్తున్న రైతులు
తమకు న్యాయం చేయాలని రైతుల వేడుకోలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
నిబంధనలకు విరుద్ధంగా సాగవుతున్న ఉప్పునీటి రొయ్యల సాగుతో పచ్చని పంట పొలాలన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. ఉప్పునీరు చేరి భూములన్నీ చౌడుబారడంతో నాట్లు నాటినా పనికిరాకుండాపోతున్నాయి. దీంతో మొన్నటి వరకూ ఎకరాకు 50 బస్తాల దిగుబడి వచ్చే వరి భూములను సైతం రైతులు బీడుగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు జిల్లాల్లోనూ అనేక మండలాల్లో ఈ పరిస్థితి ఉన్నప్పటికీ నిడమర్రు మండలంలో మాత్రం పరిస్థితి దారుణంగా తయారైంది. ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు వంటి మండలాలతోపాటు ఆకివీడు వంటి అనేక మండలాల్లో కొల్లేరును ఆనుకుని ఉన్న భూముల్లో వరిసాగు సాగుతోంది. కొల్లేరును ఆనుకుని భూములు వర్షాకాలం ముంపునకు గురయ్యే పరిస్థితి ఉండటంతో రైతులు కేవలం రబీసాగు మాత్రమే చేపడతారు. ఇప్పుడు ఆ పరిస్థితీ లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రెండు జిల్లాల్లోని పలు మండలాల్లో కొల్లేరును ఆనుకుని వేలాది ఎకరాల పంట భూములు ఉన్నాయి. అభయారణ్యం కారణంగా ఈ భూముల్లో చేపల చెరువుల తవ్వకాలకు అనుమతులు లేవు. దీంతో రైతులు ఈ భూముల్లో వరిసాగు మాత్రమే చేస్తుంటారు. ఈ భూములకు పైభాగంలో ఉన్న పొలాలన్నీ రొయ్యల చెరువులుగా మారిపోయాయి. చెరువుల్లోని ఉప్పునీటిని పంటకాలువల్లోకి వదిలేయడంతో పచ్చని పంట పొలాలన్నీ తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఉప్పునీటి బోరులు
నిబంధనల ప్రకారం ఉప్పునీటి రొయ్యలసాగు నిషిద్ధం. నిబంధనలకు విరుద్ధంగా ఉప్పునీటి బోర్ల తవ్వకాలు జరిపి రొయ్యలసాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. విద్యుత్ కనెక్షన్లు కూడా ఏర్పాటు చేసి ఉప్పునీరు తోడేస్తున్నారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో చేపల చెరువులు ఉండగా మూడొంతుల చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉప్పునీటి రొయ్యలసాగు సాగుతోంది. చెరువుల్లో నింపుతున్న ఉప్పునీటిని రొయ్యల పట్టుబడి పట్టినప్పుడు పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. ఈ నీరు కొల్లేరును ఆనుకుని ఉన్న వరి పొలాల్లోకి చేరుతోంది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. రైతులు అనేకసార్లు ధర్నాలు, ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో పంట భూములన్నీ చౌడుబారిపోయాయి. నారుమడులు వేస్తే బతకడం లేదు. నాట్లు నాటితే మొక్కలు చనిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో రైతులకు ఏం చేయాలో తెలీని పరిస్థితి ఏర్పడింది. ఈ భూములన్నీ చిన్న, సన్నకారు రైతులవే. నిడమర్రు మండలం అడవికొలను గ్రామానికి చెందిన కలందకోడు పాయలోని భూములు పూర్తిగా పండని పరిస్థితికి చేరాయి. దీంతో ప్రస్తుత రబీలో చాలామంది రైతులు తమ భూములను సాగు చేయకుండా వదిలేస్తున్నారు. సాగు చేసినా పంట పండని పరిస్థితి ఉంది. దీంతో పెట్టుబడుల రూపంలో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ప్రతియేటా నష్టాలను భరించలేక భూములను సాగు చేయకుండా వదిలేస్తున్నారు. అభయారణ్యం పేరుతో ఒకపక్క చేపల చెరువుల తవ్వకాలకు అనుమతివ్వకుండా, మరోపక్క ఉప్పునీటిని పంటకాలువల్లోకి రాకుండా నిరోధించకపోవడంతో పంట భూములన్నీ బీడు భూములుగా మారిపోతున్నాయి. ఈ విధంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటలు పండకపోవడంతో ఆ భూములు ఎవరూ కొనే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.










