Jul 26,2023 21:33

ముమ్మరంగా సాగుతున్న వరినాట్లు

ప్రతికూల వాతావరణం కారణంగా వర్షాలు అనుకూలించకపోవడంతో గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది ఖరీఫ్‌ సీజన్‌ జిల్లాలో ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదైనా, గత కొద్దిరోజులుగా జిల్లా అంతటా కురుస్తున్న వర్షాలకు రైతుల్లో ఖరీఫ్‌ సాగుపట్ల ఆశలు చిగురించాయి. చెరువుల్లో నీరు చేయడంతో రైతులు సాగుకు సన్నద్ధమవ్వడంతో ఉబాలు ఊపందుకున్నాయి. వర్షాలు ఆలస్యం కావడంతో ఎప్పుడూలేనంతగా ఈ ఏడాది రైతులు ఎక్కువ శాతం ఎదలు జల్లుకున్నారు. వరినారు అందుకురావడంతో పొలాల్లో ముమ్మరంగా దుక్కులు సాగించి నాట్లు వేసుకునేందుకు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల రైతులు సిద్ధం కావడంతో ఉభాలు ఊపందుకున్నాయి.
పార్వతీపురం: జిల్లాలో 15మండలాల్లో మొత్తం ఖరీఫ్‌ విస్తీర్ణం లక్షా80వేల ఎకరాలు కాగా, అందులో వీరఘట్టం మండలంలో 17700 ఎకరాలతో వరిపండించే మండలాల్లో జిల్లాలో ఆగ్రస్థానంలో ఉంది. 3835 ఎకరాల్లో పాచిపెంట మండలం ఆఖరున నిలచింది. ఇప్పటికే తోటపల్లి కుడి, ఎడమకాలువల ద్వారా సాగు నీరు విడుదల చేయగా, జంఘావతి దిగువకాలువ నీటిని కూడా విడుదల చేశారు. అలాగే వట్టిగెడ్డ రిజర్వాయర్‌, పెదంకలాం రిజర్వాయర్ల నుండి నీరు విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నీటిపారుదలశాఖకు నిధులు విడుదల సకాలంలో మంజూరు చేయకపోవడంతో పలు రిజర్వాయర్‌లకు సంబంధించిన కాలువల్లో పూడికలు పెద్ద సమస్యగా మారాయి. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడికలు తొలగించకుండా జంఝావతి కుడికాలువ నీరు విడుదల చేశారు. అయితే పూడికలు విపరీతంగా పేరుకుపోవడంతో కొమరాడ, పార్వతీపురం, సీతానగరం, గరుగుబిల్లి మండలాలకు చెందిన 12వేల ఎకరాల ఆయకట్ట రైతులకు సాగునీరు ఇంత వరకూ అందకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీతానగరం, బలిజిపేట మండలాలకు సంబంధించి 8వేల ఎకరాల ఆయకట్టకు ఆధారమైన పెదంకలాం కాలువలో ఎక్కడికక్కడ గండ్లు, పూడికలు పడడంతో అనుకున్నంతా నీరు చేరక కర్షకలు ప్రయాస పడుతున్నారు. ఆయా రిజర్వాయర్లకు సంబంధించిన అధికారుల స్పందించి పనులు వెంటనే ప్రారంభించి పూడికలు తొలగించకపోతే నీరు విడుదల చేసినప్పటికీ ప్రయోజనం ఉండదని వాపోతున్నారు.
గత ఐదురోజులుగా జిల్లాలో వర్షపాతం
జిల్లాలో గల ఐదురోజులుగా నమోదైన వర్షపాతం ఇలా ఉంది. ఈనెల 22న 177 మిల్లీమీటర్లు కాగా, 23న 112మి.మీ., 24న 176.8మి.మీ, 25న 472మిమీ, 26న 115.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అయితే ఇది సాధారణ వర్షపాతం కన్నా తక్కువ అయినప్పటికీ రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ ప్రకటించడంతో మరిన్ని వర్షాలు కురిసి చెరువులు నిండుతాయని అధికారులతో పాటు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చెరువులకు జల కళ
వీరఘట్టం : మండలంలోని వెంకమ్మసాగరం, రాజ, సీతమ్మధార, నారాయణ, చెల్లమ్మ తదితర చెరువులు నీళ్లతో కళకళాలాడుతున్నాయి. కురుస్తున్న వర్షాలతో పాటు కాలువ ద్వారా సాగునీరు రావడంతో ఒక్కసారిగా చెరువులో నీటిమట్టం అమాంతంగా పెరిగిపోయింది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అన్నదాతలు పొలం పనులు బిజీగా ఉన్నారు.