ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
- ప్రలోభాలతో గెలవాలని అధికార పార్టీ
- అజెండా లేని అధికార, ప్రతిపక్ష అభ్యర్థులు
- ప్రజల, ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలే అజెండాగా పిడిఎఫ్ అభ్యర్థులు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్/ బండి ఆత్మకూరు
నంద్యాల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కేవలం గెలుపే లక్ష్యంగా అజెండా లేకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల తరుపున పట్టభద్రుల అభ్యర్థులుగా వెన్నపూస రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అధికార పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. ప్రజా సమస్యలు, ఉపాధ్యాయ, ఉద్యోగుల, కార్మికుల కర్షకులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, సీపీఎస్ రద్దు వంటి సమస్యలే ప్రధాన అజెండాగా పిడిఎఫ్ అభ్యర్థులు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో దిగారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ, ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపునకు అంచున ఉన్నారు. ప్రజా సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయ, సమస్యలే అజెండాగా పిడిఎఫ్ అభ్యర్థులు కత్తి నరసింహ్మారెడ్డి, పోతుల నాగరాజులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపునకు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, వాపక్షాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజా సంఘాలు, ఉద్యోగులు ఉపాధ్యాయులు పట్టభద్రులు, విద్యావంతులు మేధావులు బలపరుస్తున్న పిడిఎఫ్ తరపున ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల నాగరాజు బరిలో ఉండగా అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డి, టీడీపీ తరుపున భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఎంతో అవసరం ఉందని, వీరి గెలుపు పేద మధ్యతరగతి ఉద్యోగులు ఉపాధ్యాయుల, కార్మికుల కర్షకుల గొంతుకగా శాసనమండలిలో ప్రజా వాణి వినిపించాలని ఆకాంక్షతో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఉమ్మడి అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి పోతుల నాగరాజుల గెలుపుకు ప్రచారం నిర్వహిస్తూ పట్టభద్రులను ఉపాధ్యాయులను ఓటు అభ్యర్థిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు సభలు సమావేశాలు పెట్టి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ తన అధికార బలాన్ని ఉపయోగించి ప్రచారాన్నీ చేపడుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో నేరుగా సమావేశాల ఏర్పాటు చేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిని, పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస రవీంద్రారెడ్డిలకు ఓటు వేస్తే తర్వాత యాజమాన్యాలకు తగిన ప్రతిఫలం అందిస్తామని నేరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను తుంగలో తొక్కి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుకోసం వాలంటీర్ల ద్వారా నంద్యాలలో కౌన్సిలర్లు ప్రచారం చేయిస్తున్నారు. సచివాలయ పరిధిలో కూడా వాలంటీర్ల ద్వారా, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఓటర్లను గుర్తించే పని వాలంటీర్లకు అప్పగించారు. ఎక్కడైతే ఓటర్ల ఉన్నారో అక్కడికి వాలంటీర్ల ద్వారా వెళ్లి అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రచారం చేస్తున్నారు. నంద్యాల దేవనగర్, డోన్‌లతో పాటు ఇతర ప్రాంతాల్లో వాలంటీర్లు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీల గెలుపునకు ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థికి ప్రైవేటు ఉపాధ్యాయులు ఓటు వేయడానికి ఒక్కొక్కరికి రూ.5వేలు, పట్టభద్రుల అభ్యర్థికి రూ.2వేల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికార పార్టీకి అనుకులంగా ఉన్న ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యల ద్వారా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.










