Jul 14,2023 23:15

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జూన్‌ 1 నుంచే కాలువలకు ముందస్తుగానే సాగునీటిని విడుదల చేశామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కాకినాడ జిల్లాలో ఖరీఫ్‌ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. అరకొరగానే నాట్లు పడ్డాయి. ఇప్పటి వరకూ 70 శాతం నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా శుక్రవారం నాటికి కేవలం 5.13 శాతం మాత్రమే సాగు పనులు జరిగాయి. సాగునీటి సరఫరాలో పర్యవేక్షణ లోపాలు, కాలువల్లో పేరుకుపోయిన పూడిక, ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం వంటి అనేక కారణాల వల్ల సాగునీరు పలు ప్రాంతాలకు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఖరీఫ్‌ సాగు మందుకొడిగా సాగుతోంది. దీంతో వచ్చే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రానున్న తుఫానులు, వరదల వలన రైతులకు భారీ నష్టం తప్పే పరిస్థితి కనిపించడం లేదు.
అంచనాలు తారుమారు
ఈ నెల 15 నుంచి 20 వ తేదీ వరకూ వెదజల్లు సాగు చేసుకోవాలని, నాట్లు వేయడాన్ని పూర్తి చేయాలని, అక్టోబరు 31 నాటికల్లా కోతలు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే అధికారులు అంచనా వేసిన లక్ష్యానికి సుదూరంగా వాస్తవ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 2.30 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు జరుగనుందని అధికారులు అంచనా వేశారు. ఇవి కాకుండా పత్తి 10,237 ఎకరాలు, చెరకు 9,387 ఎకరాలు, మినుములు 2,811, మొక్కజొన్న 595, కందుల 382, నువ్వులు 230, వేరుశెనగ 17 ఎకరాల్లో సాగవుతుందని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో వరిని తీసుకుంటే ఇప్పటి వరకు 52 వేల ఎకరాలకు సరిపడా సుమారు 3 వేల ఎకరాల్లో మాత్రమే ఇప్పటి వరకు అంటే 22.60 శాతం నారు మడులు సిద్ధం చేశారు.సాగునీరు రాకపోవడంతో దీనిలో భాగంగా ఇప్పటి వరకు కేవలం 41 వేల ఎకరాల్లో మాత్రమే దమ్ములు పూర్తి అయ్యాయి. 7,535 ఎకరాల్లో ఎదజల్లు సాగు, 4,252 ఎకరాల్లో ఉడ్పులు పూర్తి చేశారు. మొత్తంగా రెండు పద్ధతుల్లో నేటి వరకూ 11,807 పంట వేసారు.
పేరుకుపోయిన పూడిక
గత నెల 1న కాలువల ద్వారా విడుదల చేసినా నేటికీ రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ కాలువల్లో పూడిక పేరుకపోవడం వారి పాలిట శాపంగా మారింది. పూడిక పనులు ప్రభుత్వం సక్రమంగా చేపట్టకపోవడంతో సాగు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. పుష్కలమైన సాగునీరు అందుబాటులో ఉన్నా గుర్రపు డెక్క, తూటి కాడ పేరుకుపోయి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఇదే విషయాన్ని శుక్రవారం జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాలు అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ధవళేశ్వరం నుంచి సామర్లకోట వరకు ఈస్ట్రన్‌ డెల్టా పరిధిలో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ప్రధాన కాలువతో పాటు అనుబంధంగా ఉన్న పిల్ల కాలువలు ఈ ఏడాది పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకోలేదు. మరోవైపు ఏలేరు, పిబిసి ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలవల్లోనూ పూడికతీత పనులు ముందుకు సాగలేదు. దీంతో సాగునీరు లభ్యత నామమాత్రంగానే ఉంది.