ప్రజాశక్తి-నక్కపల్లి:ఉపమాక తీర్ధంలో మసాలా ఘుమ ఘుమ లాడుతోంది. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వెంకన్న వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా తీర్ధంలో మసాలా దినుసులు వ్యాపారం ప్రత్యేకం. స్వామి వారి ఉత్సవాలు ఈనెల 2న ప్రారంభమై 10వ తేదీ రాత్రితో ముగిసాయి. ప్రతీ ఏటా స్వామి ఉత్సవాల సందర్భంగా కొత్త అమావాస్య ముందు రోజు వరకు (18 రోజుల పాటు) ఉత్సవాల తీర్ధ జరుగుతుంది. అనంతరం ఈనెల 20వ తేదీ వరకు ఈ తీర్థం కొనసాగుతుంది. శని, ఆదివారాలు సెలువు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు.తీర్ధంలో మసాలా దినుసులు, పిల్లల ఆట వస్తువులు, గృహౌపకర సామగ్రి, గాజులు, ఫ్యాన్సీ పావులతో పాటు తినుబండారాలకు సంబందించి తోపుడు బండ్లపై ఖర్జూరం, శెనగపప్పు, ద్రాక్ష వంటివి విక్రయిస్తారు. తీర్ధంలో మసాలా దినుసులు వ్యాపారం అధికంగా సాగు తుంది. పసుపు, కుంకుం జీల కర్ర, ధనియాలు, యాలికలు, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, అవాలు, ఫలావు సామగ్రి, వెల్లుల్లి పాయులు, ఎండు మిర్చి తదితర సుగంధ ద్రవ్యాలను విక్రయిస్తుంటారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంతో పాటు, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు గ్రామాల నుంచి జనం తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని ఏడాది పొడువునా సరిపడే మసాల దినుసులు కొనుగోలు చేసుకుంటారు. నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, తదితర మండలాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు మసాలా దినుసులు కొనుగోలు చేసుకుంటున్నారు. వీటిని పెద్ద పెద్ద మూటలతో తీసుకు వెళ్తున్నారు. చాలా మంది భక్తులు మసాలా దినుసులు తప్పనిసరిగా కొనుక్కొని ఇళ్లకు తీసుకువెళ్ళడం అనవాయితీగా వస్తుంది. ఇవన్నీ ఒకే చోట లభించడంతో జనం దుకాణాల వద్ద ఎగబడుతున్నారు. దీంతో ,మసాలా దినుసుల దుకాణాలు జనం రద్దీతో కిటకిలాడుతున్నాయి. జాతర సందర్భంగా లక్షలాధి రూపాయుల మసాలా దినుసుల వ్యాపారం సాగుతుంది. తీర్థంలో పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు కమ్మలతో తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు.










