Aug 15,2023 00:21

నియామక పత్రం ఇస్తున్న కార్యదర్శి జయ ప్రకాష్‌

ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని ఉపమాక పంచాయతీ సర్పంచ్‌గా ప్రగడ వీరబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు సర్పంచ్‌గా ఉన్న గోనగాల అప్పలనర్స తన పదవికి రాజీనామా చేయడంతో ఉప సర్పంచ్‌ గా ఉన్న ప్రగడ వీరబాబు ను సర్పంచ్‌గా నియమిస్తూ డిపిఓ శిరీషా రాణి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు సోమవారం ఉదయం ఉపమాక పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జయప్రకాష్‌ నియామక పత్రాన్ని ప్రగడ వీరబాబుకు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వీరబాబు మాట్లాడుతూ, గ్రామ పెద్దల సలహాలు తీసుకుంటూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ మాజీ సభ్యులు కొప్పిశెట్టి కొండబాబు, కొప్పిశెట్టి బుజ్జి, తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్‌, జడ్పిటిసి మాజీ సభ్యులు కురుందాసు నూకరాజు, పంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్లు గురు భవాని, దవరసింగి రాంబాబులు వీరబాబుకు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్‌ చెరుకూరి వెంకటేశ్వరరావు, కొంకిపూడి సూరిబాబు, కొప్పిశెట్టి రమణ, దొరబాబు, శ్రీను, సత్తిబాబు, దేముళ్ళు, రవి, సిద్దాబత్తుల నూకతాత, సత్తిబాబు, గోర్స శ్రీనివాస్‌, తోలేటి శ్రీను, వాసు, రాము, హరి, నూకరాజు, నాగేశ్వరరావు పాల్గొన్నారు .
బుచ్చయ్యపేట సర్పంచ్‌గా లక్ష్మి
బ్రుచ్చయ్యపేట :బుచ్చయ్యపేట సర్పంచ్‌గా సుంకర లక్ష్మి ఎన్నిక ఏకగ్రీవమైంది. రెండేళ్ల క్రితం పంచాయతీ ఎన్నికల్లో బుచ్చయ్యపేట సర్పంచ్‌గా సుంకర సూరిబాబు ఎన్నిక య్యారు. ఆయన గత ఏడాది రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. సూరిబాబు సతీమణికి సర్పంచ్‌గా అవకాశం ఇవ్వాలని గ్రామానికి చెందిన వైసిపి, టిడిపి పెద్దలు తీర్మానించారు. దీంతో సర్పంచ్‌ అభ్యర్థిగా సూరిబాబు సతీమణి సుంకర లక్ష్మి ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. స్క్రూట్నీ అనంతరం ఆర్వో కామేశ్వరరావు సోమవారం సుంకర లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువపత్రాన్ని అందజేశారు.