Mar 04,2023 00:30

ప్రజాశక్తి -నక్కపల్లి:ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కళ్యాణోత్సవాల సందర్భంగా శుక్రవారం తెల్లవారు జాము నుంచి ఉపమాక భక్తజనసంద్రంగా మారింది. ఇతర జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు స్వర్ణలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి భక్తుల రాక పెరగడంతో ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. పలువురు భక్తులు బందరు వరస్సులో పుణ్యసాన్నాలు అచరించారు. ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వర ప్రసాదాచార్యులు, కృష్ణ మాచార్యులు, శేషాచార్యుల నేతృత్వంలో పూజలు నిర్వహించారు. మహిళల కోలాట ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయం వద్ద లడ్డూలు, ప్రసాదాలు విక్రయించకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశ చెందారు. పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు.
సిఐ నారాయణరావు, ఎస్‌ఐ శిరీషలు పోలీసులకు సూచనలు, సలహాలను అందజేసారు.
సేవా కార్యక్రమాలు
హెటిరో డ్రగ్స్‌ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. శ్రీసత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేసారు. తుని సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు పులహార పంపిణీ చేసారు.
వట్టు వస్త్రాల సమర్పణ
కల్యాణోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే గొల్ల బాబూరావు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ డైరక్టర్‌ మోహన్‌ రెడ్డి, కంపెనీ ప్రతినిధులు సత్యనారాయణరెడ్డి, కుల్లాయిరెడ్డి, మబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, రాష్ట్ర కాపు కార్పోరేషన్‌ డైరక్టర్‌ వీసం రామకృష్ణ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేష్‌లు దర్శించుకున్నారు.