
ప్రజాశక్తి-యర్రగొండపాలెం
యర్రగొండపాలెం ప్రాంతంలో గురువారం సాయంత్రం ఒక గంటపాటు భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. మురుగు కాలువలు నిండి పొర్లాయి. వాతావరణం చల్లబడింది. కాగా గత 20 రోజులుగా వర్షాలు లేక, బోర్లలో నీటి మట్టం పడిపోయి వేసిన పంటలు బెట్టకు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కురిసిన వర్షంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక గంట పాటు కురిసిన మంచి వర్షం కురిసిందని తెలిపారు. ఈ వర్షం పంటలకు మరో వారం రోజులు ఊపిరి పోసినట్లేనని తెలిపారు. తోటలు బెట్టకు వచ్చిన తరుణంలో కురిసిన వర్షానికి తోటల్లో బలం మందులు చల్లితే బెట్ట తగ్గి పంటలు ఏపుగా పెరుగుతాయని రైతులు తెలిపారు. కురిసిన ఈ వర్షం అన్ని పంటలకు ఉపయోగకరమేనని చెప్పారు. అయితే బోర్లలో నీటిమట్టం పెరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇలాంటి వర్షాలు వారంతో నాలుగైదు కురిస్తే రైతులకు కొంతమేరకు ఉపయోగకరమన్నారు. లేకుంటే ఖరీఫ్‌లో వేసిన పంటన్నీ ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు.