ఉపఎన్నికల్లో టిడిపిదే విజయం
ప్రజాశక్తి-జలదంకి : ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో 15 వార్డులకు, ఒక సర్పంచ్ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయని, ఈ ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తుందని ఉదయగిరి మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకట రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మండల కేంద్రమైన జలదంకిలోని స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాల కాలంగా ప్రజలు వైసిపి పాలనతో విసిగి వేసారి ఉన్నారన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. టిడిపి ఎప్పుడూ ప్రజా శ్రేయస్సునే కోరుకుంటుందన్నారు. కొండాపురం మండలంలో తహశీల్దార్‌పై నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీరు సోషల్ మీడియాలో వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులంతా భయభ్రాంతులతో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అదే టిడిపి పాలనలో ఏ రోజు కూడా అధికారులను ఇబ్బందులు పెట్టిన దాఖలాలు లేవన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తనను ఎంఎల్‌ఎగా, నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం టిడిపి పార్టీ ఎన్నికల పరిశీలకులు, వికాస్ హరికృష్ణ, నాయకులు పచ్చ పెంచలనాయుడు, మేదరమెట్ల శేషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










