Sep 01,2023 01:12

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటం, లక్ష్మణరావు తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలలేస్తున్న అతిథులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఎంత సాకేతికత అయినా ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదని, వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటు పడేలా చేయడమే కెవిఆర్‌ - జయలక్ష్మి ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ముఖ్య ఉద్దేశ్యమని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్‌హాల్‌లో గురువారం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణన్‌ ప్రతిభా పురస్కారాల మహోత్సవ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, డిఇఒ కె.శామ్యూల్‌ హాజరై ఎంపికైన ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. సభకు యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షత వహించగా లక్ష్మణరావు మాట్లాడుతూ 2008 నుండి తమ తల్లిదండ్రుల పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. విద్య పరంగా వెనుకబడిన పల్నాడు జిల్లాలో ఫలితాలే ఉపాధ్యాయుల పని తీరుకు నిదర్శనమన్నారు. జిల్లాలో విద్యావ్యవస్థ, ప్రజల జీవన పరిస్థితులు మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు మనసుపు పెట్టి పాఠాలు చెప్పే ప్రతి ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడే అన్నారు. పల్నాడు జిల్లాకు మణిహారమైన వరికపూడిశెల ప్రాజెక్ట్‌ 60 ఏళ్లుగా కలగా ఉందని, పనులు మొదలయ్యేలా కృషి చేయాలని కోరారు.
ఎంపి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా కొన్ని అంశాల్లో ప్రజా ప్రతినిధులకు, ఉపాధ్యాయులకు కొంత దూరం పెరిగిందని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. తాను ఏ గ్రామానికి పర్యటనకు వెళ్లిన తప్పనిసరిగా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆంగ్ల మాధ్యమంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించేందుకు తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు.
కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సాంకేతికతను అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పారు. పల్నాడు జిల్లా ఉపాధ్యాయుల పనితీరు బ్రహ్మాండంగా ఉందని, విద్యాపరంగా జిల్లాను ఏడో స్థానంలో నిలిపారని అభినందించారు. పదవ తరగతిలో పాఠశాల ఉత్తీర్ణత శాతంతో సంబంధం లేకుండా విద్యార్థి శక్తిసామర్థ్యాలు వెలిగితీయడమే లక్ష్యంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. కొన్ని ప్రాంతాలలో పని చేసేందుకు ఉపాధ్యాయులు అనాసక్తిగా ఉంటున్నారని, ప్రజలు ఉంటేనే ప్రజాప్రతినిధులు ఉంటారని, అలాగే విద్యార్థులుంటేనే ఉపాధ్యాయులు ఉంటారనే విషయం గుర్తించాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా అంకితభావంతో పని చేయాలని కోరారు. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, ప్రజలతోనూ స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పాలని సూచించారు. అనంతరం ప్రతిభ పురస్కారాలకు ఎంపికైన 34 మంది ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ప్రైవేటు పాఠశాలల కళాశాలల నిర్వాహకులకు పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. తొలుత ప్రజానాట్య మండలి కళాకారులు గేయాలు ఆలపించడంతోపాటు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. వీరికి ప్రోత్సాహకంగా టైనిటాట్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పాతూరి కోటేశ్వరమ్మ రూ.5 వేలు బహుకరించారు.