Nov 16,2022 23:51

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు సత్యనారాయణ, చిత్రంలో ఎంపిపి లక్ష్మి తదితరులు

- తక్షణమే టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలి
- ఎంపిపి కారం లక్ష్మి
ప్రజాశక్తి-విఆర్‌.పురం

పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా చదువులెలా వస్తాయని ఎంపిపి కారం లక్ష్మి అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆమె మండలంలోని సోములగూడెం గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, పాఠశాల సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 320 మంది విద్యార్థినులు ఉన్న ఈ పాఠశాలలో 22 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, వారిలో ఐదుగురు విద్యా వాలంటీర్ల అని తెలిపారు. నాడు-నేడు అంటూ పాఠశాలలకు రంగులు వేస్తే చదువులు రావని, ఉపాధ్యాయులను నియమిస్తే చదువులు వస్తాయని హితవుపలికారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో వెంటనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కనీసం వసతి గృహానికి నైట్‌ వాచ్‌మెన్‌ కూడా లేకపోవడం దారుణమన్నారు. గిరిజన విద్యార్థులపై చిన్నచూపు తగదని ఏజెన్సీ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. ఆమె వెంట సిపిఎం జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, పంకు సత్తిబాబు, సర్పంచ్‌ పులి సంతోష్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.