Feb 13,2023 23:44

మాట్లాడుతున్న కమిషన్‌ సభ్యులు

ప్రజాశక్తి-పాడేరు, :- అల్లూరి జిల్లాలో ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని, వీరిని చూస్తూ ఉపేక్షించేది లేదని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు గొండు సీతారాం, కుమారి ఆదిలక్ష్మి త్రిపర్ణ తెలిపారు. సోమవారం జిల్లా విద్యా శాఖాధికారులతో పాడేరు కాఫీ హౌస్‌లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సభ్యులు సీతారాం మాట్లాడుతూ, డ్రాప్‌ ఔట్లు జిల్లాలో ఎంతమంది ఉన్నారు, గుర్తింపుపై ఆరా తీశారు. డుమ్మా కొడుతూ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కు త్వరిత గతిన నివేదిక సమర్పించాలని ఆయా మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలలను మత్తు పదార్థాలు, వ్యసనాలకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టేలా ప్రణాళికా యుతంగా వ్యవహరించాలని కమిషన్‌ సభ్యులు ఆదేశించారు. బాలలు, విద్యార్థుల జీవితాలను చిద్రం చేస్తున్న మత్తు పదార్థాలు, బాలల అక్రమ రవాణా వ్యవహారాలపై కమిషన్‌ పర్యవేక్షణ జరుపుతోందన్నారు. జిల్లాలో పిల్లలతో, విద్యార్థులతో గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు సరఫరా చేయిస్తున్న వారిని అరెస్టులు చేయడమే కాకుండా వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలతో బాలలు మత్తు పదార్థాలు, అక్రమ బాలల రవాణా రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్‌ ను తీర్చిదిద్దేందుకు సమాయత్త మవుతున్నామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యురాలు ఎం. రజనీ, ఐసిడిఎస్‌. పిడి ఎన్‌.సూర్యలక్ష్మి, సిడిపిఓలు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఐ.కొండలరావు, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఎల్‌.రజని, పిఒడిటిటి భారతి, చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం జిల్లా కన్వీనర్‌ లవకుశ పాల్గొన్నారు.
హుకుంపేట: బాలల హక్కుల కమిషన్‌ మెంబర్స్‌ గోండు సీతారాం, టి.ఆదిలక్ష్మి లను మోదకొండమ్మ గుడి వద్ద బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల కన్వీనర్‌ కో కన్వీనర్‌ కె.ఆనంద్‌, జె.బలన్నలు మర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం బాలల హక్కుల పరిరక్షణ వేదిక హుకుంపేట బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల కన్వీనర్‌ కో కన్వీనర్‌ కె.ఆనంద్‌, జె. బలన్న మాట్లాడుతూ, మండలంలో శిశు మరణాలు, ఆశ్రమ పాఠశాలలు మరణాలు, పౌష్టికాహారం, తదితర అంశాలపై చర్చించి కమిషన్‌ దృష్టికి వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక విశాఖపట్నం జిల్లా కన్వీనర్‌ బి.లవకుశ, పార సంస్థ ప్రసన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.