Feb 17,2023 23:55

ప్రమాణ స్వీకారం చేస్తున్న యుటిఎఫ్‌ మండల కార్యవర్గ సభ్యులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
ఇటీవల ఉపాధ్యాయులపై అధికారులు చేస్తున్న అనేక రూపాల్లో వేధిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆంధ్ర ప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి అన్నారు. చిన్న చిన్న కారణాలు చూపిస్తూ ఉపాధ్యాయులకు అకారణంగా షోకాజ్‌ నోటీసులు, సస్పెండ్‌ ఉత్తర్వులు ఇవ్వడం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. యుటిఎఫ్‌ అచ్యుతాపురం మండల శాఖ ప్రధాన కార్యదర్శి సబ్బారపు నూకరాజు అధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న శ్రీలక్ష్మి మాట్లాడుతూ పాదయాత్రలో వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, ప్రతినెల ఒకటవ తేదీన ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
మండల నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతరం శ్రీలక్ష్మి, ఎన్నిక పరిశీలనకులు జిఎస్‌ ప్రకాష్‌ సమక్షంలో యుటిఎఫ్‌ మండల నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మండల శాఖ నూతన గౌరవాధ్యక్షులుగా కె.సుభాషిణిదేవి, అధ్యక్షులుగా కె.మురళీకృష్ణ, సహ అధ్యక్షులుగా పైడిరాజు, సూర్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా సబ్బారపు నూకరాజు, కోశాధికారిగా బికె.మహిమరావు ఎన్నికయ్యారు. జిల్లా కౌన్సిలర్స్‌గా వత్సవాయి శ్రీలక్ష్మి, కృష్ణవేణి, రేబాక రవికుమార్‌, గుత్తలు సూర్యప్రకాష్‌, మహిళా కన్వీనర్‌గా అరుణకుమారి, మండల కౌన్సిలర్స్‌గా లావణ్య, కుమారి, సిపిఎస్‌ కన్వీనర్‌గా సలీం, అకడమిక్‌ కన్వీనర్‌గా సత్యనారాయణ, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా ఎస్తేరు రాణి, సోషల్‌ మీడియాలికు రేఖ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మురళీకృష్ణ, సబ్బారపు నూకరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు.