ప్రజాశక్తి-అనకాపల్లి
ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉన్నతాధికారుల వేధింపులు ఆపాలని ఫ్యాప్టో అనకాపల్లి జిల్లా శాఖ చైర్మన్ గొంది చిన్నబ్బాయి అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో బుధవారం చిన్నబ్బాయి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను తీవ్ర మానసిక ఒత్తిడి గురి చేయడం సరికాదన్నారు. స్వేచ్చగా విద్యాబోధన చేసుకునే అవకాశం ఉపాధ్యాయులకు కల్పించాలన్నారు. విద్యా సంవత్సరం ముగుస్తున్న సమయంలో లెసన్ ప్లాను, ఎల్‌ఐపి ప్లాను, బైజూస్ కంటెంట్ చూసి లెసన్ ప్లాన్ రాయాలని చెప్పడం సరికాదని తెలిపారు. విద్యా బోధనతో పాటు బోధనేతర పనులు, మధ్యాహ్న భోజనం, బాత్‌రూమ్‌ల నిర్వహణ, నాడు-నేడు, రకరకాల యాప్‌ల నిర్వహణతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయని ప్రభుత్వం పనిచేస్తున్న వారిపై అదనపు భారం మోపడం సరికాదన్నారు. ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, 8వ తేదీ దాటిన జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. బోధనేతర పనుల నుంచి ఉపశమనం లేకపోతే బోధన కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యలపై భవిష్యత్తులో అన్ని సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఫ్యాప్టో జనరల్ సెక్రెటరీ వై సుధాకర్, కో చైర్మన్ సాయి ప్రసాద్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ప్రేమ్ కుమార్, ఎన్ సన్యాసినాయుడు, రమణాజీ, కార్యవర్గ సభ్యులు వి.శ్రీలక్ష్మి, శాస్త్రి, ఏ.రవి తదితరులు పాల్గొన్నారు.










