ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఉపాధ్యాయులపై అక్రమ కేసులు, సస్పెన్షన్లు ఎత్తివేయాలని ఎపి అమరావతి జెఎసి జిల్లా ఛైర్మన్ కె.రమేష్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతి జెఎసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడో దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రమేష్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు వారికి సంబంధం లేని పనులను కేటాయించి ప్రభుత్వం వేధిస్తుందని, ఉపాధ్యాయులు అంటే ప్రతి విద్యార్థికీ మంచి విద్యను అందించి వారిని సమాజంలో ఉన్నతస్థాయిలో ఉండేలా తీర్చిదిద్దేవారన్నారు. అలాంటి ఉపాధ్యాయులతో ఉదయాన్నే పాఠశాలకు వెళ్లగానే టాయిలెట్ల ఫొటోలు తీయాల్సి రావడం, వాటిని వివిధ రకాల యాప్‌లలో అప్‌లోడ్ చేయడం చాలా బాధాకరమైన విషయమన్నారు. చిన్నచిన్న కారణాలకు కూడా ఉపాధ్యాయులను అన్యాయంగా సస్పెండ్ చేస్తున్నారని, ఈ వైఖరి మారాలన్నారు. ఇటీవల సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ చలో విజయవాడ పేరుతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు వారివారి సమస్యల పరిష్కారానికి నిరసన తెలిపే క్రమంలో వారిపై అక్రమంగా కేసులు, బైండోవర్ కేసులను పెట్టడం అన్యాయమని, వాటిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించొద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రెటరి బి.రాంబాబు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎ.ప్రమోద్‌కుమార్, కె.రవిచంద్రరావు, పంచాయతీరాజ్ ఇంజనీర్ జిల్లా కార్యదర్శి ఆర్.వీరబాబు, వివిధ ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.










