- యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ఉపాధ్యాయులపై నిరంతరం ఒత్తిడి పెంచి విద్యాశాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు, ఎస్.కిషోర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో యుటిఎఫ్ ఆఫీస్ బేరర్స్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెవికె కిట్లు సకాలంలో ఇవ్వకుండా విద్యార్థుల బయోమెట్రిక్ అమలు కావడం లేదని ఉపాద్యాయులపై ఒత్తిడి చేయడం తగదన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో యాప్‌ల భారం తగ్గిస్తామని, ఒకే యాప్ లో వివరాలన్నీ నమోదు చేసేలా చూస్తామని విద్యాశాఖ అధికారులు హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. యాప్‌లను కుదించకపోగా, అదనంగా ప్రశస్త యాప్‌ను ఇచ్చి నెలాఖరులోపు పాఠశాల విద్యార్థులు ఆరోగ్యానికి సంబంధించిన సర్వే చేయాలని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పాఠశాలకు రాని విద్యార్థులను డ్రాప్ బాక్సులో ఉంచి ఆ విద్యార్థులను పాఠశాలల్లో చేర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అలా చేర్చుకున్న విద్యార్థులకు జెవికె అథెంటిఫికేషన్ ఎందుకు పూర్తి చేయలేదని ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయుల వేతనాలు రెండు నెలలుగా చెల్లించడం లేదని, వెంటనే జీతాలు చెల్లించే చర్యలు చేపట్టాలన్నారు. నాడు-నేడు పనుల నుంచి ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని, ఉపాధ్యాయులను 45 రోజులుగా శిక్షణా తరగతుల పేరుతో బోధనేతర కార్యక్రమాల్లో తిప్పడం సరికాదన్నారు. ఎఫ్‌ఎ-1 పరీక్షల షెడ్యూల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని కోరినా ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాయాలని విద్యాశాఖ అధికారులు చెప్పడం సరికాదన్నారు. విద్యార్థులకు స్వేచ్ఛనిచ్చి తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసేందుకు అనుమతించాలన్నారు. మున్సిపల్ అర్బన్ ఎంఇఒ పోస్టులు మున్సిపల్ ఉపాధ్యాయులకే వచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. సర్వీస్ రూల్స్ త్వరగా ఆమోదించి బదిలీలు ప్రమోషన్స్ నిర్వహించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు 2008 డిఎస్‌సిలో ఎంపికై ప్రస్తుతం ఎంటిఎస్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. నూతన విద్యా విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 1170ను రద్దు చేయాలని, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులపై వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఆగస్టు 12న ఫ్యాప్టో ఆధ్వర్యాన జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు కె.వైకుంఠరావు, ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, కె.దాలయ్య, పి.సూర్యప్రకాశరావు, ఎం.వి రమణ, హెచ్.అన్నాజీరావు, జి.సురేష్, ఆర్.పరమేశ్వరరావు, పి.మురళీధరరావు, మురళీప్రకాష్, జి.నారాయణరావు పాల్గొన్నారు.










