Jul 13,2023 23:39

మాట్లాడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షులు నాగజగదీశ్వరరావు

ప్రజాశక్తి-అనకాపల్లి : ఉద్యోగ విరమణకు సిద్ధంగా ఉన్న 200 మంది మహిళా, పురుష ఉపాధ్యాయులను ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయడం ముమ్మాటికీ విద్యాశాఖ మంత్రి బొత్స కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో నిర్వహించిన ఊరేగింపును దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారని ఆరోపించారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సిఫార్సులతో చేస్తున్న ఉపాధ్యాయ అక్రమ బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి బొత్స బదిలీలకు ముందు 200 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వ సిఫార్సులతో బదిలీలు చేశారని, ఇప్పుడు సాధారణ బదిలీలు ముగిశాక మరో 500 మందిని బదిలీలు చేసినట్లుగా తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సిఫార్సులతో బదిలీలు చేపట్టడం వల్ల మొత్తం బదిలీలు ప్రక్రియ అపహాస్యానికి గురైందని విమర్శించారు. బదిలీ ఉపాధ్యాయులకు ఇప్పటికీ జీతాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు బోడి వెంకటరావు, కుప్పిలి జగన్మోహన్‌, మల్ల గణేష్‌, గుడాల సత్యనారాయణ, మల్ల శివన్నారాయణ, బర్నికాన శ్రీనివాసరావు, పూడి త్రినాధ, బుద్ద భువనేశ్వరరావు పాల్గొన్నారు.