ప్రజాశక్తి - పొన్నూరు రూరల్ : ఉపాధ్యాయులను విస్మరించిన ప్రభుత్వం మనుగడ సాగించలేదనే విషయం వైసిపి ప్రభుత్వం గుర్తించాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమవుతోందని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర మాజీ అధ్యక్షులు కె.జోజయ్య అన్నారు. యుటిఎఫ్ గుంటూరు జిల్లా 49వ కౌన్సిల్ సమావేశం పొన్నూరు పట్టణంలోని జెఎంఆర్ ఫంక్షన్ హాల్ (గరికపాటి శ్రీనివాస్ ప్రాంగణం)లో ఆదివారం నిర్వహించారు. జెఎంఆర్ ఫంక్షన్ హాలు నుండి ఐలాండ్ సెంటర్ వరకూ ఉపాధ్యాయులు, నాయకులు భారీ ర్యాలీ చేశారు. సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తిరిగి సమావేశాల ప్రాంగణం వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఎస్‌టిఎఫ్‌ఐ జెండాను రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎస్ కుసుమకుమారి, యుటిఎఫ్ పతాకాన్ని సీనియర్ నాయకులు జి.మోహన్‌రావు ఆవిష్కరించారు. అనంతరం కొసరాజు హరికృష్ణబాబు వేదికపై నిర్వహించిన సభకు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జోజయ్య మాట్లాడుతూ 50 ఏళ్ల యుటిఎఫ్ ప్రయాణంలో అనేక పోరాటాలు చేసిందని, ఉపాధ్యాయులకు అనేక హక్కులు సాధించి పెట్టిందని గుర్తు చేశారు. ఉద్యమాలను అణచాలని ప్రభుత్వాలు యత్నించినా అది తాత్కాలికమేనని, అణచివేత పరాకాష్టకు చేరిన రోజున పాలకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉపాధ్యాయులు మరింత పట్టుదలతో ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఆయనతీరు అసలు బాగోలేదని అన్నారు. సిపిఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని పాదయాత్ర సందర్భంగా హామీనిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులంతా ఐక్యంగా పోరాడ్డం ద్వారానే హక్కులు సాధించుకోవాలని అన్నారు. సమావేశంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్, గౌరవాధ్యక్షులు పీవీ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి డి.సాయికృష్ణ, కె.బావన్నారాయణ, జిల్లాలోని అన్ని మండలాల నుండి నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.