Aug 25,2023 23:44

గుంటూరు: బోధన కంటే బోధనేతర కార్యక్రమాల చుట్టూ ఉపాధ్యాయుల్ని తిప్పుతూ, పాఠశాలల పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయు లను కించప రుస్తూ మాట్లాడటం సరికాదని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు అన్నారు. యుటిఎఫ్‌ ఆఫీసు బేరర్స్‌ సమావేశం జిల్లా అధ్యక్షురాలు బి.ఆదిలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బోధనేతర కార్యక్రమాలపైనే పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుందన్నారు. తెలుగు మీడియం బోధించే ఉపాధ్యాయులతో బలవంతంగా ఇంగ్లీషు మీడియంలో బోధింపచేస్తున్నారని, విద్యార్థులు ఇంగ్లీషులోనే పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. బోధనలో స్వేచ్ఛ, ప్రశాంత వాతావరణం కల్పిస్తేనే విద్యార్థికి నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. పాఠశాలల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ సూచనలు, సలహాలు ఇచ్చేదిగా ఉండాలన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్‌ యం.హనుమంతరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్థానం మేరకు పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని, నిరసన తెలిపే వారిపై నిర్బంధాలు ఆపాలని కోరారు. పాత పెన్షన్‌ ఇచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యం.కళాధర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులను వేధిస్తే నాణ్యమైన విద్య అందించటం సాధ్యం కాదన్నారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఏఎల్‌ శివపార్వతి, జిల్లా కోశాధికారి దౌలా, ఇతర సభ్యులు పాల్గొన్నారు.