
యుటిఎఫ్ ఆధ్వర్యాన డిఇఒకు వినతి
ప్రజాశక్తి - భీమవరం
ప్రభుత్వం ఇంత వరకూ బదిలీ, ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండానే మరలా వర్కింగ్ పేరుతో వారిని గందరగోళానికి గురిచేయడం తగదని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్.విజయరామరాజు అన్నారు. కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి.రమణకు యుటిఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయరామరాజు మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకుండా పని ఒత్తిడి పెంచడం దారుణమన్నారు. మూడు నెలల నుంచి జీతాలందక ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వర్క్ అలాట్మెంట్లో లోపాలను సరిచేసి సవరణకు అవకాశం ఇవ్వాలన్నారు. జిఒ 117, 128 ప్రకారం తుది జాబితా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏ మండలంలో ఉన్న ఉపాధ్యాయులను అదే మండలంలో సర్దుబాటు చేయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కె.రాజశేఖర్ ట్రెజరర్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు సాయిరాం, ఏసుబాబు, రామకృష్ణంరాజు, రామకృష్ణ, ప్రసాద్, క్రాంతి కుమార్, బాబ్జీ పాల్గొన్నారు.