May 17,2023 00:43

మాట్లాడుతున్న డిఇఒ చంద్రకళ

ప్రజాశక్తి -భీమునిపట్నం : 2018లో నూతనంగా డిఎస్‌సి ద్వారా ఎంపికైన హిందీ, సోషల్‌ ఉపాధ్యాయులకు స్థానిక ప్రైవేట్‌ హైస్కూల్‌ క్యాంపస్‌లో మంగళవారం శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను డిఇఒ ఎల్‌.చంద్రకళ ప్రారంభించారు. నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన వారు విద్యార్థుల భవిష్యత్‌ నిర్మాణం కోసం ఎలా కృషి చేయాలన్నదీ ఆమె వివరించారు. నూతన విద్యా విధానం -2020పై అవగాహన కల్పించారు. పాఠ్య ప్రణాళిక నిర్మాణం, పాఠ్యాంశాల పట్ల అవగాహన కల్పించారు. ఈ నెల 19వ తేదీ వరకు ఈ శిక్షణా తరగతులు జరుగుతాయన్నారు. ఎస్‌సిఇఆర్‌టి పరిశీలకులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, ఈ తరగతుల్లో ఉపయుక్తమైన పద్ధతులను నేర్చుకొని, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. రీసోర్స్‌పర్సన్‌ టిఎస్‌వి.ప్రసాదరావు, ఎంవివిఎన్‌.బలరామ్మూర్తి, సంపత్‌ మధుమతి, ఝాన్సీ పాల్గొన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఉపాధ్యాయులు శిక్షణా తరగతులకు హాజరయ్యారు