ప్రజాశక్తి నర్సీపట్నం టౌన్ :ఇంత ఉన్నత చదువులు చదివి విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సింది పోయి కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం పట్ల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని పాఠశాలలను ఆకస్మికంగా శనివారం సందర్శించారు. పెద్ద బొడ్డేపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. వర్క్ బుక్‌లో క్లాస్ వర్క్‌ను ఉపాధ్యాయిరాలు కనీసం తనిఖీ చేయక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిదగ్గర మీ పిల్లలు హౌమ్ వర్క్‌ని కూడా ఈ విధంగానే పరిశీలిస్తున్నారా అని ప్రశ్నించారు. క్లాస్ వర్క్, హౌంవర్క్‌లు పరిశీలించకపోవడాన్ని చూస్తుంటే చదువులపై శ్రద్ధ చూపడం లేదనేది అర్థం అవుతుందని ఆయన అన్నారు. కొంతమంది విద్యార్థులు నేలపై కూర్చోవడంతో బెంచీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బెంచీలు దెబ్బ తినడంపై అధికారులను నిలదీశారు. నూతన బల్లలను ఏర్పాటు చేయాలన్నారు. జనవరి ముగుస్తున్నా ఇంకా సిలబస్ పూర్తి చేయకపోవడం పట్ల సంబంధిత ఉపాధ్యాయురాయులపై మండిపడ్డారు. పాఠశాలలో శుద్ధ జల ప్లాంట్‌పై డీఈలకు మెమోలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాడు నేడులో భాగంగా నిర్మిస్తున్న పాఠశాల భవనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం నర్సీపట్నంలో పలు పాఠశాలలను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఇప్పటివరకు విద్యార్థులకు బుక్స్ సరిగ్గా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సమయానుకూలంగా సిలబస్ ఇప్పటికీ పూర్తి కాక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం 25శాతం పిల్లలు కూడా చదువుతున్నట్లు కనపడలేదన్నారు. ఉపాధ్యాయులు తీరు ఈ విధంగా ఉంటే ఉపేక్షించేది లేదన్నారు.' నా సహనాన్ని మీరు పరీక్షించొద్దని ఆయన అలాగే చెబుతారులే అని అనుకుంటే చర్యలు తప్పవన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నాడు నేడు పనులపై జిల్లా వృత్తి విద్య అధికారి మురళీధర్‌ను ఆరా తీశారు. నవంబర్ వరకే వివరాలు తెలియజేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు నేడు పనులపై సరైన సమాధానం చెప్ప లేకపోవడంతో ఏఈ రమణాజిపై అసహనం వ్యక్తం చేశారు.










