Aug 04,2023 23:44

నరసరావుపేటలో డిఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ప్రమోషన్లు, బదిలీలు పొందిన ఉపాధ్యాయుల జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతు యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు జిల్లాల విద్యాశాఖ అధికారి కార్యాలయాల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాల్లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం గుంటూరు డిఇఒ పి.శైలజకు వినతిపత్రం అందచేశారు. గుంటూరు ధర్నాలో యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎన్‌.కుసుమకుమారి మాట్లాడుతూ జూన్‌లో జిల్లాలో వేల మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లు, బదిలీలు పొంది కొత్త స్థానాలకు వెళ్లారని, అయితే రెండు నెలలు గడుస్తున్నా వారికి జీతాల చెల్లించలేదని అన్నారు. బ్యాంకు ఇఎంఐలు చెల్లించాల్సిన వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌, సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, కోశాధికారి ఎమ్‌డి.దౌలా, జిల్లా కార్యదర్శి సిహెచ్‌.ఆదినారాయణ, ఎమ్‌డి.షకీలాబేగం, కె.సాంబశివరావు, ఎం.గోవిందు, జి.వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీను పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట ధర్నాలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, జి.విజయసారధి మాట్లాడుతూ పాఠాలు చెప్పడం, ప్రభుత్వం నిర్దేశించిన యాప్‌లలో వివరాలు పొందుపరచడం, నాడు-నేడు పనులు, విద్యా కానుక కిట్ల పంపిణీ, తదితర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తున్నా ఉపాధ్యాయులపై ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. క్యాడర్‌ స్ట్రెంత్‌ అప్డేట్‌ చేస్తున్నామనే నెపంతో జీతాలను కావాలనే ఆలస్యం చేయటం కక్షపూరిత వైఖరన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మంది ఉపాధ్యాయులకు రెండు నెలల వేతనాలు ఆగిపోయాయని, పల్నాడు జిల్లాలో 80 శాతం పైగా ఉపాధ్యాయుల జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వేతనాలు కోసం రోడ్డెక్కడం గత 25-30 ఏళ్లలో ఎన్నడూ లేదన్నారు. ఉపాధ్యాయుల క్యాడర్‌ స్ట్రేంత్‌ అప్డేట్‌ చేసి ఖజానా అధికారులకు పంపి తద్వారా జీతాలు చెల్లింపులో జాప్యం నివారించాల్సిన విద్యాశాఖ సరైన రీతులలో వ్యవహరించడం లేదని విమర్శించారు. ఈ కారణంగా ఉపాధ్యాయులు బ్యాంకు లోన్‌ చెల్లించలేక డిఫాల్ట్‌గా మారటమే కాకుండా అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోందన్నారు. విద్యా సంవత్సరం మొదటి నెల అవటం కళాశాలలో చదివే తమ బిడ్డల ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. ఊపిరి సలపని ప్రభుత్వ పథకాల అమలతో ఉపాధ్యాయులు సతమవుతు విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఇవన్నీ పట్టని ఉన్నత స్థాయి విద్యాశాఖ అధికారులు చిన్న అంశాలనే లోపాలుగా చూపుతూ ఉపాధ్యాయులలో మనోస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరసనలో జిల్లా సహాధ్యక్షులు ఎం.మోహన్‌రావు, ఎ.భాగ్యశ్రీదేవి, కోశాధికారి జె.వాల్యానాయక్‌, గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు శౌరి రాణి, కె.తిరుపతిస్వామి, జి.వెంకటేశ్వర్లు, కాంతారావు, జమాల్‌, అరుణ్‌ కుమార్‌, సుందర్‌రావు పాల్గొన్నారు.