Aug 04,2023 22:55

ధర్నా చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు

- డిఇఒ కార్యాలయం వద్ద యుటిఎఫ్‌ ధర్నా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
జూన్‌లో బదిలీలు, ఉద్యోగోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు, హెచ్‌ఎంలకు పెండింగ్‌ జీతాలు చెల్లించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు, ఎస్‌.కిషోర్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌పై జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్‌ 12 నాటికి బదిలీలు, జూన్‌ 25 నాటికి పలు కేడర్ల ప్రమోషన్స్‌ ప్రక్రియ పూర్తయినా, కేడర్‌ అప్‌డేట్‌ పేరిట ఇంతవరకు జీతాలు చెల్లించకపోవడం సరికాదన్నారు. బదిలీల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించామని చెప్పిన విద్యాశాఖ జీతాలు సకాలంలో చెల్లించడంలో విఫలమైందన్నారు. జీతాల మీద ఆధారపడే ఉపాధ్యాయులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. జీతాలు చెల్లింపులు త్వరగా చేపట్టాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కె.వైకుంఠరావు, కోశాధికారి బి.శ్రీరామ్మూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్‌.దమయంతి, సీనియర్‌ నాయకులు పి.ధర్మారావు, యు.అప్పలసూర్యనారాయణ, పి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.