యుటిఎఫ్ ఆధ్వర్యాన ధర్నా
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
బదిలీలై జీతాలు రాని ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం యుటిఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక డిఇఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ఉపాధ్యాయులకు ఇప్పటికీ జీతాలు చెల్లించకపోవడం విద్యాశాఖ వైఫల్యమని యుటిఎఫ్ నాయకులు అన్నారు. పిజిటిలుగా బదిలీ పొందిన ఉపాధ్యాయులకు, పోస్టులు సర్దుబాటు వల్ల బదిలీ పొందిన ఉపాధ్యాయులకు, కొన్ని పాఠశాలలకు కొత్తగా హెచ్‌ఎం పోస్టులు ఇవ్వడం వల్ల కొంతమంది ఉపాధ్యాయులకు, అలాగే కొన్ని ఉన్నత పాఠశాలల్లో డ్రాయింగ్ ఆఫీసర్ లేక వంటి కారణాలతో జిల్లాలో సుమారు 200 మంది వరకు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చాలామంది ఉపాధ్యాయులు పిల్లల చదువుల కోసం, బ్యాంకుల్లో తీసుకున్న ఇంటి రుణాల కోసం ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముస్తఫా ఆలీ, రవికుమార్, జిల్లా కోశాధికారి జివి.రంగమోహన్, ఆడిట్ కన్వీనర్ మోహన్‌రావు, జిల్లా కార్యదర్శులు సుధారాణి, రాంబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎస్‌టియు ఆధ్వర్యాన..
ఏలూరు టౌన్: బదిలీలైన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఎస్‌టియు ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు పిబివిఎంఎల్.నారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎం.శామ్యూల్, కెఆర్.పవన్‌కుమార్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ డివిఎవి.ప్రసాద్, నాయకులు బంద్రెడ్డి వాసు, వెంకట్, నాగార్జున, మధు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నేతలు పాల్గొన్నారు.










