కడప అర్బన్ : దసరా సెలవులు ప్రయివేటు ఉపాధ్యాయులకు ఇవ్వాలని, స్టడీ క్లాసులు, క్లాస్ వర్క్‌ల పేరుతో వారిని స్కూల్‌కి రమ్మని చెప్పకుండా సెలవులు ఇవ్వాలని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 14 నుంచి దసరా సెలవులు ప్రకటించిందని చెప్పారు. ప్రతి సారి జిల్లాలోని ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థలు అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సెలవులు వర్తింపజేయకుండా వివిధ రకాల పేరుతో వారిని విద్యా సంస్థలకు రావాలని ఒత్తిడి తెస్తూ రాని, బెదిరిస్తూ ఉద్యోగాల నుంచి అకారణంగా తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రయివేటు అధ్యాపకులు కుటుంబాలతో దసరా సెలవులు గడపాలని ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల యాజమాన్యాలు వారి హక్కులను హరిస్తూన్నాయని విమర్శించారు. విద్యా శాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో ఇలా జరుగుతున్నాయన్నారు. దసరా సెలవులలో యువజన సంఘంగా విద్యా సంస్థలు తరగతులు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో నగర అధ్యక్షులు షాకీర్, కార్యదర్శి డి.ఎం.ఓబులేసు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న శివకుమార్










