Aug 07,2022 23:35

సమావేశంలో మాట్లాడుతున్న పాకలపాటి రఘువర్మ

ప్రజాశక్తి- మాధవధార : ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేయాలని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్‌చేశారు. ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ విశాఖ జిల్లా సమావేశం ఆదివారం మాధవధార పాఠశాలలో జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సిపిఎస్‌ను తక్షణమే రద్దుచేయాలని, పాఠశాలల విలీనాన్ని అపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని రకరకాల జిఒలతో గందరగోళంలోకి నెట్టిందని విమర్శించారు. ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రామకృష్ణారావు మాట్లాడుతూ, పోరాటాలతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 292 మహిళా కళాశాలను ప్రారంభించినప్పటికీ ఉపాధ్యాయులను నియమించలేదని తెలిపారు. తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమరాన త్రినాథ్‌, రాష్ట్ర కార్యదర్శి సరస్వతి, ఉపాధ్యాయులు సనపల ఉమాపతి పాల్గొన్నారు.