Oct 01,2023 20:31

అభివాదం చేస్తున్న ఫ్యాప్టో నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక (ఫ్యాఫ్టో) డిమాండ్‌ చేసింది. ఆదివారం లక్క పందిరి వీధిలోని ఎపిటిఎఫ్‌ భవనంలో ఫ్యాప్టో సమావేశం జరిగింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పర్యటన అనంతరం జిల్లాలో పలువురు ఉపాధ్యాయులకు చిన్న చిన్న కారణాలు ఎత్తి చూపుతూ, మెమోలు, షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం, సస్పెన్షన్లు జారీ చేయడంపై చర్చించారు. తక్షణమే ఉపాధ్యాయుల సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేశారు. ఈ అంశాలపై భవిష్యత్తులో ఉమ్మడి ఐక్య కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రిని కలసి వినతిపత్రం ఇవ్వాలని తీర్మానం చేశారు. సమావేశంలో ఎపిటిఎఫ్‌ (257) నాయకులు పి.శ్రీనివాసరావు, పిఆర్‌ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరావు, ఎస్‌టియు నాయకులు డి.శ్యామ్‌, ఆప్టా నాయకులు వి.జమెనా, ఎస్‌.భాస్కరరావు ఎ.సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం సరికాదు
ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. సస్పెన్షన్‌ కు గురైన ఉపాధ్యాయులను ఆదివారం ఆయన కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రవీణ్‌ ప్రకాష్‌ స్కూల్స్‌ విజిట్స్‌ సందర్భంగా చిన్న చిన్న విషయాలకు సస్పెన్షన్‌కు గురి చేయడం సరికాదన్నారు. అధికారులు విజిట్‌ చేసే సందర్భంలో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే డిపార్ట్మెంట్‌ పరంగా అంతర్గతంగా సమావేశం ఏర్పాటు చేసుకొని , చర్చించుకొని సరి చేయాలి తప్ప ఈ విధంగా ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేయడం తగదన్నారు. ఆయన వెంట పిఆర్‌టియు అర్బన్‌ కార్యదర్శి చిట్టి రామునాయుడు, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌, పిఅర్‌టియు నాయకులు కరుణ్‌, రమేష్‌ తదితరులు ఉన్నారు.