Oct 21,2023 23:47

పల్నాడు జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ లో ఉన్న రూ 2 వేల కోట్ల ఆర్థిక బకాయిలలో దసరాకు ఇస్తామని ప్రకటించిన రూ 800 కోట్ల ఆర్థిక బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌.టి.యు సంఘం రాష్ట్ర అదనపు కార్యదర్శి కె.కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం స్టేషన్‌ రోడ్డులోని గాంధీ పార్క్‌ వద్ద ఆక్రందన దీక్ష పేరుతో ఎస్‌ టియు పల్నాడు జిల్లా కమిటీ నిరసన తెలిపింది.. ఈ కార్యక్రమానికి ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యు. చంద్రజిత్‌ యాదవ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ఇంత వరకూ చెల్లించలేదని, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ హామీ నెరవేరలేదని,3,4,5 తరగతుల విలీనంతో పాఠశాల విద్యను నిర్వీర్యం చేశారని, చివరికి ప్రతినెల 1వ తేదీ చెల్లించాల్సిన వేతనాలు కూడా చెల్లించడం లేదని విమర్శించారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.ఎం సుభాని, గంగాధరబాబు, రాష్ట్ర కార్యదర్శి పోటు శ్రీనివాస రావు ప్రసంగించారు.అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌ వద్దకు వెళ్ళి డి.ఆర్‌.ఓ వినాయకంకు వినతిపత్రం అందజేశారు. దీక్షకు ఎఐటియుసి పల్నాడు జిల్లా నాయకులు కాసా రాం బాబు వైదన వెంకట్‌, నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆర్‌ సెల్వరాజ్‌ సంఘీభావం తెలిపారు.