Aug 19,2023 20:54

సామూహిక నిరసనలో ఫ్యాప్టో నాయకులు

  కడప అర్బన్‌ ఉపాధ్యాయుల పని సర్దుబాటును తక్షణమే ఆపాలని, బదిలీ, ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయుల వేతనాలను తక్షణం చెల్లించాలని ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీ రాజా డిమాండ్‌ చేశారు. పని సర్దుబాటును ఆపాలని, జీవో 117 ను రద్దు చేయాలని, బదిలీ, ఉదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో కడప లోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బి.లక్ష్మి రాజా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టి మూడు మాసాలు కూడా గడవకముందే పని సర్దుబాటు పేరుతో మళ్లీ ఉపాధ్యాయులను ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు నియమించడం దారుణమన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇలా పని సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు నియమించడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. అధికారుల, పాలకుల వైఖరి చూస్తే పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఎద్దేవా చేశారు. ఫ్యాప్టో జిల్లా ట్రెజరర్‌ వై.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. నాడు-నేడు పేరుతో పాఠశాలలను ఒక పక్క అభివద్ధి చేస్తూనే, మరోపక్క విద్య రంగాన్ని ప్రణాళికాబద్ధంగా నాశనం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే పని సర్దుబాటును ఆప డంతో పాటు, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోతే ఈనెల 23వ తేదీ పాఠశాల విద్య డైరెక్టర్‌ వద్ద 12 గంటల ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు పి.రమణారెడ్డి, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు, ఏపీటీఎఫ్‌ (19 38) రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఆర్‌.అబ్దుల్లా, బిటిఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌.ఆర్‌.హరి కొండయ్య పాల్గొన్నారు.