
యుటిఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ డిమాండ్ - రాష్ట్రంలో వినాశకర విద్యా సంస్కరణలు : ఎంఎల్‌సి షేక్ సాబ్జీ
ప్రజాశక్తి - భీమవరం
ఉపాధ్యాయుల పెండింగ్ జీతాలు తక్షణం చెల్లించాలని యుటిఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ డిమాండ్ చేసింది. స్థానిక యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం యుటిఎఫ్ మధ్యంతర జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఉభయగోదావరి జిల్లాల ఎంఎల్‌సి షేక్ సాబ్జీ, యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభ సూచికగా ఎస్‌టిఎఫ్ పతాకాన్ని షేక్‌సాబ్జీ, యుటిఎఫ్ పతకాన్ని గోపీమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షేక్‌సాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో వినాశకరమైన విద్యా సంస్కరణలు అమలవుతున్నాయన్నారు. జిఒ 117 వల్ల ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం అంటే పేద పిల్లలకు విద్య అందని ద్రాక్షగా మారి రాజ్యాంగ లక్ష్యాన్ని తుంగలోకి తొక్కుతున్నట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి మాట్లాడుతూ బదిలీలు, అలాట్‌మెంట్స్‌్ జరిగిన ఉపాధ్యాయులకు మూడు నెలల నుంచి 20 శాతం మంది కూడా జీతాలు చెల్లించలేదని మండిపడ్డారు. రీ అలాట్‌మెంట్స్ జరిగి మూడు నెలలు గడుస్తున్నా మళ్లీ పని సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. వెంటనే 117 జిఒను రద్దు చేయడంతో పాటు సిపిఎస్‌ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా స్థాయిలో యుటిఎఫ్, ఫ్యాప్టో ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 23న ఇబ్రహీంపట్నంలో పాఠశాల కమిషనర్ కార్యాలయం ముందు 12 గంటల పాటు ధర్నా నిర్వహించనున్నామని చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకె.రామభద్రం మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ వెంటనే రూపొందించి ప్రమోషన్లు, బదిలీలు జరపాలని డిమాండ్ చేశారు. జిపిఎస్ అకౌంట్స్ తెరిపించాలని, జిఒ నంబరు 84 వల్ల ఏర్పడిన సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.మార్కండేయులు, సహాధ్యక్షులు కె.రాజశేఖర్, కె.శ్రీదేవి, జిల్లా కోశాధికారి సిహెచ్ పట్టాభి రామయ్య, జిల్లా కార్యదర్శులు జై.కుమార్, ఏసుబాబు, క్రాంతికుమార్, రామకృష్ణంరాజు, కెఆర్‌కె.ప్రసాద్, శ్రీనుబాబు, రత్నం రాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రామానుజరావు, కృష్ణమోహన్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.