Nov 22,2022 23:08

  • బందరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా
  • బకాయిలు చెల్లించాలని డిమాండ్‌
  • 30న పిడిఎఫ్‌ ఎంఎల్‌సిల దీక్ష : కె.ఎస్‌.లక్ష్మణరావు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (కృష్ణా)
''మా అవసరాల నిమిత్తం మేము దాచుకున్న డబ్బుల కోసం ప్రభుత్వాన్ని ప్రాధేయపడటం ఎంటి..ఇదేనా ఫ్రెండ్లీ ప్రభుత్వం...ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు'' అని పలు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ బకాయిలు, ఇవ్వాల్సిన సరెండర్‌ లీవులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, రిటైర్డ్‌ ఉపాధ్యాయుల జివిఎస్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితర ఆర్థిక సంబంధమైన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యాన మంగళవారం మచిలీపట్నంలోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద గల ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎన్‌టిఆర్‌, కృష్ణాజిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి కె.ఎస్‌.లక్ష్మణరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మట్లాడుతూ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయాలేదన్నారు. దీంతో ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదన్నారు. తమ అవసరాల నిమిత్తం దాచుకున్న డబ్బులను ప్రభుత్వం దారిమళ్లించడం ఏమిటని ప్రశ్నించారు. వారు దాచుకున్న డబ్బులు రూ.1826 కోట్లు వారికే చెల్లించాల్సి ఉందన్నారు. సిపిఎస్‌పై కూడా ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే చెల్లించకపోతే ఈనెల 30న పిడిఎఫ్‌ ఎంఎల్‌సిల పక్షాన నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు. యుటిఎఫ్‌ కష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి జె.లెనిన్‌ బాబు మాట్లాడుతూ పిఆర్‌సి చర్చల సమయంలో ఈ ఏడాది మార్చి నాటికి అన్ని బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. జూలైలో కొద్దిపాటి పిఎఫ్‌ మొత్తాలను మాత్రం చెల్లించారని పేర్కొన్నారు. పిఎఫ్‌ బకాయిలు 8 నెలలుగా, మిగిలిన అన్నిరకాల బకాయిలు ఏడాదికిపైగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. యుటిఎఫ్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.సుందరయ్య మాట్లాడుతూ ఒకపక్క ముఖ్యమంత్రి రాష్ట్రం ఆర్థికంగా పురోగమిస్తున్నామని చెబుతూండగా, ఆర్థికశాఖ అధికారులు మాత్రం బాగోలేదంటూ 1వ తేదీన చెల్లించాల్సిన జీతాలు సకాలంలో చెల్లించడం లేదన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పి మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ సిపిఎస్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఎ బకాయిలకు ఆదాయ పన్ను చెల్లించినా ఇప్పటికీ వారు ఖాతాల్లో జమ కాలేదన్నారు. యుటిఎఫ్‌ కష్ణాజిల్లా అధ్యక్షులు బి.కనకారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ కె.ఎ.ఉమామహేశ్వరరావు, సహాధ్యక్షులు ఎమ్‌డి.షౌకత్‌ అలి, అపర్ణ పాల్గొన్నారు. ఈధర్నాలో ఎపి ఎన్‌జిఓస్‌ తూర్పు కష్ణా చైర్మన్‌ ఉల్లి కష్ణ, విద్యాశాఖ ఉద్యోగుల సంఘ నాయకులు హుస్సేన్‌, ఎం.రామ్‌ ప్రసాద్‌, సిపిఎం నాయకులు కొడాలి శర్మ, సిహెచ్‌.జయరావు, ఐసిఇయు డివిజన్‌ అధ్యక్షులు జె.సుధాకర్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు.