Oct 21,2023 20:54

దీక్షలో పాల్గొన్న యుటిఎఫ్‌ నాయకులను లాక్కెళ్తున్న పోలీసులు

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను కొనసాగించాలని కోరుతూ యుటిఎఫ్‌ నాయకత్వం గత మూడు రోజులుగా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట కొనసాగిస్తున్న నిరాహార దీక్షలను శనివారం పోలీసులు భగం చేశారు. దీక్షలో పాల్గొన్న యుటిఎఫ్‌ నాయకులు ఐ.రోజామణి ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం రాత్రి ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీన్ని సాకుగా తీసుకున్న పోలీసులు దీక్షలో ఉన్న జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట రమేష్‌, ఎస్‌.మురళీమోహనరావుతో పాటు ఇతర ఉపాధ్యాయులను, నాయకులను బలవంతంగా జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలవంతంగా దీక్షలను ప్రభుత్వం, పోలీసులు కలిసి భగం చేయవచ్చునేమో కానీ ఉద్యోగుల మనసులను మాత్రం గెలవలేరని అన్నారు. భవిష్యత్తులో పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ఐక్యపోరాటాలు నిర్వహిస్తామని తద్వారా ఒపిఎస్‌ను పునరుద్ధరించుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తుందని, దీక్షలను బలవంతంగా విరమింపజేయడం ప్రభుత్వం చేతకానితనానికి అద్దం పడుతుందని, భవిష్యత్తులో ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఒపిఎస్‌ సాధనకు ప్రాణాలైనా అర్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన ఇతర ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు పి.సుదర్శన్‌, ఐ.రోజామణి, ఎం.శంక ర్రావుతో పాటు జిల్లా వ్యాప్తంగా, పలు మండలం నుంచి వచ్చిన ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.