ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : ఉపాధ్యాయుల కృషితో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించామని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమం పట్టణంలో ''సి'' కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం జరిగింది. తొలుత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి కలెక్టర్ నిశాంత్ కుమార్ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో గొప్ప మార్పు తీసుకురా గల శక్తి ఉపాధ్యాయుడిదేన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల కృషి వల్ల రాష్ట్ర స్థాయిలో టెన్త్ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచామన్నారు. రాష్ట్ర స్థాయిలో 8 పాఠశాలలు ఉత్తమ పాఠశాలలుగా ఎంపిక కాగా, అందులో 4 పాఠశాలలు మన జిల్లా నుండి ఉండడం గర్వంగా ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా ఉండాలని, గురువుకు మించిన పాఠ్య పుస్తకాల్లేవని తదనుగుణంగా బోధన చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బి.గౌరీశ్వరి, డిఇఒ ఎన్.ప్రేమకుమార్, గిరిజన సంక్షేమశాఖ డిడి కె.శ్రీనివాసరావు, డిపిఆర్‌ఒ ఎల్.రమేష్, డిప్యూటీ డిఇఒ విజయ కుమారి, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.
సీతంపేట : ఐటిడిఎలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పిఒ కల్పనా కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, అభినందించారు. కార్యక్రమంలో ఎపిఒ రోసిరెడ్డి, డిప్యుటీ డిఇఒ లిల్లీరాణి, డిడి శ్రీనివాసరావు, ఎటిడబ్ల్యుఒలు మంగవేణి, కృష్ణవేణి, ఎఎంవో కోటిబాబు, జిసిడిఒ రాములమ్మ, స్పోర్ట్స్ ఇంచార్జ్ జాకబ్, దయానంద్ సూపరిండేట్లు దేశ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










