ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని ఆర్‌ఆర్ లేబర్ కాలనీ మున్సిపల్ హైస్కూలులో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థులు గొంతెత్తారు. 'మేమెలా చదువుకునేది' అంటూ విద్యార్థులు శనివారం భోజన విరామ సమయంలో పాఠశాల ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు గురురాజ్ మాట్లాడారు. 850 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులతోనే విద్యా బోధన చేస్తున్నామన్నారు. గత రెండేళ్లుగా ఇతర పాఠశాలలతో సమానంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ఇటీవల తెలుగు బోధిస్తున్న ప్రధానోపాధ్యాయుని బదిలీ చేయడంతో ముగ్గురు సబ్జెక్ట్ టీచర్లతో మెరుగైన విద్యాబోధన కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్మిషన్ల సమయం, నాడు-నేడు పనుల పరిశీలన, తదితర పనులకు బోధనేతర సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని కోరారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు రమేష్ నాయుడును తిరిగి నియమించాలని విద్యార్థినులు కోరారు. సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులను కేటాయించాలని పలుమార్లు కోరినా స్పందన లేదన్నారు. పేద పిల్లలు చదివే పాఠశాల పట్ల ఉన్నతాధికారులు చిన్న చూపు చూడడం సమంజసం కాదన్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పేందుకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు ముక్తకంఠంతో నినదించారు.
పాఠశాల ముందు నిరసన తెలుపుతున్న విద్యార్థులు










