ప్రజాశక్తి - బాపట్ల
బదిలీలైన ఉపాధ్యాయులకు గత 3నెలలుగా జీతాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని యుటిఎఫ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు జడ వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు అన్నారు. యూటిఎఫ్ మధ్యంతర జిల్లా కౌన్సిల్ స్థానిక ఎన్జీవో హోంలో నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడిచి అక్రమ బదిలీలకు ప్రభుత్వం తెరతీసిందని ఆరోపించారు. వెంటనే అక్రమ వాట్సప్ బదిలీలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపియస్ విదానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో జీపియస్ అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సిఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విదానం (ఓపియస్) పునరుద్దరించాలని కోరారు. 117జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావడంతో విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని అన్నారు. తక్షణమే 117జీవో రద్దు చేసి విద్యా వ్యవస్థను కాపాడాలని కోరారు. సమావేశంలో బాపట్ల జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ పాపారావు, సహాధ్యక్షులు బండి భిక్షాలు బాబు, కోశాధికారి వెంకటేశ్వరరెడ్డి, కార్యవర్గ సభ్యులు పద్మావతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాపయ్య పాల్గొన్నారు.










