
ప్రజాశక్తి - పార్వతీపురం రూరల్ : సిపిఎస్, జిపిఎస్ రద్దు కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు చేపట్టిన నిరాహార దీక్షలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. రెండో రోజు శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ తమ నాయకులతో కలిసి దీక్షా శిబిరానికి వచ్చి నిరాహార దీక్షల శిబిరంలో కూర్చొని తన మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రావాలని కుట్రలో భాగంగా సిఎం జగన్ ఎన్నో అలవికాని వాగ్దానాలను పలు వర్గాల ప్రజలకు ఇచ్చి వారిలో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని విమర్శించారు. ఇందులో వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్న వాగ్దానం ఒకటి అని తెలిపారు. న్యాయమైన డిమాండ్లతో దీక్షలు చేస్తున్న యుటిఎఫ్ ఉపాధ్యాయులకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. దీక్షలకు అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మద్దతు తెలిపారు. ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు, మహిళా సబ్ కమిటీ కన్వీనర్ ఎన్.నిర్మల ,పార్వతీపురం యూనియన్ గౌరవ అధ్యక్షులు జి.వెంకటరమణ, అధ్యక్ష కార్యదర్శులు సింహాచలం, మల్లేష్ శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి మాట ఇచ్చి వెనుకకు తీసుకున్నందుకు నిరసనగా పార్వతీపురం- విశాఖపట్నం రహదారిపై వెనక్కు నడుస్తూ వినూత్న రీతిలో తమ నిరసనలు తెలిపారు. దీక్షలు చేస్తున్న ఉపాధ్యాయుల ఆరోగ్యం క్షీణిస్తుందని పరీక్షలు చేసిన వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన రావు మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షలకు జనసేన నాయకులు ఆరిక మోహన్‌రావు మద్దతు తెలిపారు.