Jun 19,2023 01:15

మాట్లాడుతున్న ప్రసాద్‌

ప్రజాశక్తి-గుంటూరు : నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైందని, ఈ ఏడాదైనా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా అధికారులు వ్యవహరించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ అన్నారు. స్థానిక బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడారు. ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా, సమాజంలో ఉపాధ్యాయులను చులకన భావంతో చూసేలా అధికారులు వ్యవహరించటం విద్యారంగానికి, సమాజానికి మంచిది కాదన్నారు. 11వ పిఆర్‌సి, డిఎ, హెచ్‌ఆర్‌ఎ పరంగా ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిందని, కనీసం 12వ పిఆర్‌సిలోనైనా అన్యాయం సరిచేయాలని కోరారు. ఒపిఎస్‌ ఇస్తామని జిపిఎస్‌ను ప్రతిపాదించటాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. చిన్నచిన్న కారణాలతో ఉపాధ్యాయుల్ని సస్పెండ్‌ చేయటం, తల్లిదండ్రుల ముందు ఉపాధ్యాయుల్ని దోషులుగా చిత్రీకరించటం మానుకోవాలని హితవు పలికారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే అన్ని సంఘాలనూ కలుపుకొని ఉద్యమి స్తామని హెచ్చరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌ మాట్లాడుతూ బదిలీలు, ప్రమోషన్లలో ప్రభుత్వ అస్పష్టత వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్‌ ఎం.హనుమంతరావు, రాష్ట్ర అడిట్‌ కమిటీ కన్వీనర్‌ టిఎస్‌ఎల్‌ఎన్‌ మల్లేశ్వరరావు, జిల్లా గౌరవాధ్యక్షులు పి.వి.శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఎఎల్‌ శివపార్వతి, కోశాధికారి ఎమ్‌డి.దౌలా పాల్గొన్నారు.