ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఉపాధ్యాయుల అక్రమ సస్పెన్షన్లను రద్దు చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె.ఎల్లప్ప డిమాండ్ చేశారు. మంగళవారం ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పాఠశాలకు నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె.ఎలప్ప, ఎపిటిఎఫ్ నాయకులు జి.ప్రసాద్ మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తీరు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని, పాఠశాల పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులను నిందించడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెన్షన్లతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేయడం సమస్యలకు పరిష్కారం కాదని చెబుతూనే సస్పెన్షన్ చేస్తున్నారని తెలిపారు. విద్యాసంబంధ విషయాల్లో లోపాలను గుర్తించినప్పుడు వాటిని ఉన్నతాధికారిగా సరిదిద్దాలని, వైఫల్యమంతా ఉపాధ్యాయులదే అన్నట్లుగా ప్రవీణ్ ప్రకాష్ తీరు ఉందని పేర్కొన్నారు. నాడు-నేడు పనులు పాఠశాలలో విలీనం, పదోన్నతులు, వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఉపాధ్యాయులను గందరగోళానికి గురి చేశారని తెలిపారు. రకరకాల యాప్‌ల భారాన్ని ఉపాధ్యాయులపై మోపి పాఠాలు చెప్పలేని పరిస్థితిని కల్పించారని చెప్పారు. ఇప్పుడు విద్యా సంవత్సరం చివరలో తనిఖీలంటూ హడావుడి ఎందుకో అర్థం కాని పరిస్థితి ఉందని తెలిపారు. ఇదే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరంలో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం కోల్పోయి వారి పిల్లలను ప్రయివేట్ పాఠశాలలకు పంపించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. మొత్తం విద్యా వ్యవస్థను ప్రయివేట్ పరం చేయడానికి పొమ్మనకుండా పొగబెట్టిన చందంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పర్యటనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విధానాన్ని మార్చుకోకపోతే ఉపాధ్యాయ లోకాన్ని ఒత్తిడి నుంచి కాపాడుకోవడం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు రామలింగప్ప, రాముడు, శాంతమూర్తి, ఈరన్న, విజయలక్ష్మి, సూర్యనారాయణ శెట్టి, రామిరెడ్డి, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, మద్దయ్య, ధర్మన్న, లక్ష్మీ కళ, ప్రమీల, రంగమ్మ, నాగరాజు పాల్గొన్నారు. అలాగే ఫ్యాప్టో తాలూకా కన్వీనర్, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కరెకృష్ణ ఆధ్వర్యంలో గుడికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు విధులకు హాజరై నిరసన తెలియజేశారు. బిటిఎ రాష్ట్ర కార్యదర్శి మాదన్న, ఫ్యాప్టో బాధ్యులు మహేష్, రాముడు, సాయిబాబు, ఆరన్ జ్యోతి, మారుతి, మన్సూర్ బాష, సతీష్, విజయచంద్ర, నారాయణ, రంగస్వామి, పరమేష్ పాల్గొన్నారు.
నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయులు










