ప్రజాశక్తి - ఏలూరు
ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను తక్షణం నిలుపుదల చేయాలని, న్యాయబద్ధంగా బదిలీలు, ప్రమోషన్లు పొందినవారికి జీతభత్యాలు చెల్లించాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక డిఇఒ కార్యాలయం వద్ద యుటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు గురువారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఎస్‌కె.ముస్తఫా అలీ అధ్యక్షత వహించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో సుమారు 80 వేల మంది దరఖాస్తు చేయగా అందులో 52 వేల మంది అర్హత పొందారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు ముందు 200 సిఫారసు బదిలీలు చేయడం ద్వారా మొత్తం బదిలీల ప్రక్రియ అపహాస్యానికి గురైందని ఉపాధ్యాయులు విమర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ మాట్లాడుతూ బదిలీల్లో అన్యాయం జరిగిన వారికి స్థానాల కేటాయింపులో విపరీతమైన జాప్యం చేస్తున్న డిఇఒ ప్రభుత్వ సిఫారసు బదిలీలకు మాత్రం వెంటనే పోస్టింగ్ ఇస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. బదిలీల బాధితులకు జిల్లాలో చిట్టచివర స్థానాలు కేటాయిస్తూ ప్రభుత్వ బదిలీలు పొందిన వారికి మాత్రం వారు కోరుకున్న స్థానాలను బ్లాక్ చేసిన వాటిని సైతం ఓపెన్ చేసి కేటాయించడం దారుణమన్నారు. జిల్లా కోశాధికారి ఆర్.రంగమోహన్ మాట్లాడుతూ బదిలీలతో పాటు నిర్వహించిన ప్రమోషన్లలో ప్రమోషన్ కోరుకున్న సీనియర్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసినా అధికారులు పెడచెవిన పెట్టారని, బదిలీల జాబితాలో ప్రమోషన్ పొందిన వారి పేర్లు చివరన చేర్చి సుదూర ప్రాంతాలకు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా వారు తీవ్రఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. జిల్లా గౌరవాధ్యక్షులు ఎంవి.శ్యాంబాబు మాట్లాడుతూ బదిలీల తర్వాతే ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్వహించిన ప్రమోషన్ కౌన్సెలింగ్‌లో మంచిస్థానాలు జూనియర్లకే కేటాయించారని, ప్రమోషన్ కౌన్సెలింగ్‌లో నిర్వహించిన అధికారుల వైఖరి సీనియర్లకు అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వి.కనకదుర్గ మాట్లాడుతూ బదిలీలు జరిగి నెల రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఉపాధ్యాయ కేడర్స్ స్ట్రెంగ్త్ నిర్ధారించలేదని, చేపట్టిన సర్దుబాటు ప్రక్రియలో 137 కంటే తక్కువ విద్యార్థులను 500 హైస్కూళ్లలో ప్రధానోపాధ్యాయులు, పిఇటి పోస్టులు తొలగించారని, అప్‌డేట్ చేసిన సుమారు 1500 హైస్కూళ్లకు ప్రధానోపాధ్యాయులను కొత్తగా ఇచ్చారని ప్లస్‌టు హైస్కూళ్లలో 1746 మంది పీజీ టీచరను నియమించారని వీరికి ఇప్పటి వరకూ జీతాల సమస్యను పరిష్కరిం చలేదన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పివి.నరసింహారావు మాట్లాడుతూ కొత్తగా నియమించిన ఎంఇఒ-2లకు డ్రాయింగ్ పవర్, ఎంయు-1లకు ఎఫ్‌ఎసి ఇవ్వకపోవడంతో 50 వేల మంది ఉపాధ్యాయులకు జూన్ నెల జీతభత్యాలు ఇప్పటి వరకూ చెల్లింపు కాలేదని, వెంటనే చర్యలు తీసుకుని విద్యాశాఖ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు ఇ.శివశంకర్, ఎస్.సుధారాణి, ఎన్.రాంబాబు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ బి.మోహన్‌రావు, ఏలూరు డివిజన్ వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










